Warangal Bank Robbery Case : మారుమూల బ్యాంకులే టార్గెట్ - SBI బ్యాంక్ చోరీ ముఠా అరెస్ట్, వెలుగులోకి కీలక విషయాలు-police have arrested the accused in the rayaparthi bank robbery case in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Bank Robbery Case : మారుమూల బ్యాంకులే టార్గెట్ - Sbi బ్యాంక్ చోరీ ముఠా అరెస్ట్, వెలుగులోకి కీలక విషయాలు

Warangal Bank Robbery Case : మారుమూల బ్యాంకులే టార్గెట్ - SBI బ్యాంక్ చోరీ ముఠా అరెస్ట్, వెలుగులోకి కీలక విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 06, 2024 07:12 PM IST

Warangal Bank Robbery Case : రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకులో బంగారం చోరీ కేసును వరంగల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు పరారీలో ఉన్నారని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా వెల్లడించారు.

 ఎస్‌బిఐ దోపిడీ కేసు - చేధించిన పోలీసులు
ఎస్‌బిఐ దోపిడీ కేసు - చేధించిన పోలీసులు

రాయపర్తి ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ దొపిడీ దొంగల ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నవంబర్ 18వ తేదీన చోరీ జరగగా… నిందితుల కోసం గాలిస్తూనే ఉండగా.. ఎట్టకేలకు కొందరు నిందితులు పోలీసులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగర సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా వెల్లడించారు.

yearly horoscope entry point

గత నెల 18వ తేదీన చోరీ…

గత నెల 18వ తేది అర్ధరాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌.బి.ఐ బ్యాంక్‌లో దోపిడి జరిగింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌, మహరాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠా పాల్గొన్నట్లు సీపీ తెలిపారు. ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు వివరించారు. ప్రధాన నిందితుడితో సహా మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు. పోలీసులకు పట్టుబడిన నిందితుల నుండి సుమారు ఒక కోటి 80 లక్షల నాలగువేల రూపాయల విలువ గల రెండు 2కిలోల 520 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక కారు, పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

రెక్కీ తర్వాత చోరీ - సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

“పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహమ్మద్‌ నవాబ్‌ హసన్‌ కొద్ది రోజుల కిందిత ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో వుండే బ్యాంక్‌లు, బ్యాంక్‌ భద్రత ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. అనంతరం నిందితుడు ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్రలకు చెందిన మిగితా నిందితులు కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వ్యాపారం ముసుగులో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ముఠా ముందుగా గుగూల్‌ ద్వారా మారూమూల ప్రాంతాల్లోని బ్యాంకుల సమాచారాన్ని సేకరించడం జరిగింది” అని సీపీ వివరించారు.

“సేకరించిన సమచారంలో నిందితులు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ చోరీ అనువైనదిగా గుర్తించి ఈ బ్యాంక్‌లో చోరీ చేసేందుకు ఈ ముఠా సిద్దపడింది. ఈ చోరీలో భాగంగా నవంబర్‌ 18తేదీ అర్ధరాత్రి హైదరాబాద్‌ నుండి నిందితుల్లో ఒకడైన హిమాష్షు ఓ కారులో రాయపర్తి గ్రామ శివారు ప్రాంతానికి చేరుకున్నాడు. అనంతరం అదే కారును తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు రమ్మని వెనక్కి తిప్పి పంపారు. ఆ తర్వాత మిగతా ఆరుగురు నిందితులు పంట పొలాల ద్వారా రాయపర్తి కేంద్రంలోని ఎస్‌.బి.ఐ బ్యాంక్‌ దక్షిణ భాగానికి రాత్రి 11 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఉన్న కిటీకిని తొలగించి బ్యాంక్‌ లోనికి చొరబడ్డారు” అని సీపీ చెప్పారు.

ఈ ముఠా సభ్యులు ముందుగా బ్యాంక్‌ సెక్యూరీటీ అలారంతో పాటు సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు.ప్రధాన నిందితుడితో సహ మరో నలుగురు నిందితులు బ్యాంక్‌ స్ట్రాంగ్‌ రూం తాళాలు పగులగొట్టి… స్ట్రాంగ్‌ రూంలో వున్న మూడు లాకర్లను గ్యాస్‌ కట్టర్లను వినియోగించి ఓపెన్ చేశారు. సుమారు 13 కోట్ల 61లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. వారి వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్‌ ఇతర స్వామగ్రిని బ్యాంక్‌లో వదిలి వేయడంతో పాటు అక్కడి నుండి వెళ్ళే ముందుగా సీసీ కెమెరాల సంబంధించిన డివిఆర్‌ను ఎత్తుకెళ్లారు" అని సీపీ వివరించారు.

చోరీ అనంతరం నిందితులు వచ్చిన కారులోనే తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. చోరీ సొత్తును ఏడు సమాన వాటాలు పంచుకున్నారు. నవంబర్‌ 19వ తేదిన నిందితులు మూడు బృందాలు విడిపోయి మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు తిరిగి వెళ్ళిపోయారు" అని పేర్కొన్నారు.

ఈ కేసును చేధించేందుకు వెస్ట్‌జోన్‌ డిసిపి రాజమహేంద్ర నాయక్‌ నేతృత్వంలో పదికి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని నిందితుల జాడను కనుకున్నారు. నిందితుల కదలికల గురించి ఎప్పటికప్పుడు సమచారాన్ని సేకరించినట్లు సీపీ తెలిపారు. ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. కేసును చేధించిన బృందాలను పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేకంగా అభినందించారు

Whats_app_banner

సంబంధిత కథనం