Bandi Sanjay : బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు బ్రేక్
Bandi Sanjay Praja Sangrama Yatra : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజాసంగ్రామ యాత్రకు బ్రేక్ పడింది. నిర్మల్ జిల్లాలో ప్రారంభం కాబోయే.. యాత్రను పోలీసులు నిరాకరించారు.
నిర్మల్ జిల్లాలో ప్రారంభం కానున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర(Bandi Sanjay Praja Sangrama Yatra)కు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం భైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇటీవలే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు యాత్రకు అనుమతి కోరారు. భైంసాలో శాంతిభద్రతల కారణంగా అనుమతిని పోలీసులు నిరాకరించారు. ఈ మేరకు నిర్మల్ ఎస్పీ సురేశ్ ప్రకటించారు.
ఇప్పటికే బండి సంజయ్(Bandi Sanjay) నాలుగు విడతలు ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేశారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర సిద్ధమయ్యారు. ఇక ఈ పాదయాత్ర నవంబర్ 28 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు రూట్ మ్యాప్(Route Map) కూడా ఖరారైంది. భైంసా నుంచి కరీంనగర్(Karimnagar) వరకు పాదయాత్రను ప్లాన్ చేశారు. 3 నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలనుకున్నారు.
భైంసాలో ప్రారంభ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కూడా పిలిచారు. ఈ పాదయాత్ర నిర్మల్, ఖానాపూర్, వేములవాడ(Vemulawada), జగిత్యాల, చొప్పదండి మీదుగా సాగి కరీంనగర్ లో ముగింపు సభ ఉండేలా ప్లాన్ చేసింది బీజేపీ. ఆ పార్టీ శ్రేణులు కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరించారు.
టీఆర్ఎస్(TRS) ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలను తెలుసుకునేమందుకు బండి సంజయ్ ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేశారు. 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 21 జిల్లాల్లో 1100 కి. మీటర్లకు పైగా నడిచారు. ఇదే సమయంలో ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్ర కూడా చేస్తోంది తెలంగాణ(Telangana) బీజేపీ. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే విధంగా బీజేపీ ముందుకెళ్తోంది. మునుగోడు(Munugode)లో రెండు స్థానంలో నిలవటంతో పాటు కేవలం 10వేల ఓట్లతో ఓడిపోయింది. ఫలితంగా అధికార టీఆర్ఎస్ ను అన్నివిధాల ఎదుర్కొనే పార్టీ తమదే అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలను పార్టీలోకి తీసుకుంది. తాజాగా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కమలం గూటికి చేరారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని కూడా కమలం నేతలు లీక్ లు ఇస్తున్నారు.
సంబంధిత కథనం