హైదరాబాద్ శివారు కోకాపేటలోని ఓ రెస్టారెంట్‌లో పేలుడు కలకలం రేపింది. హోటల్ వంటగదిలో గ్యాస్ లీకై భారీ శబ్దం వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి 50 శాతం పైగా ఒళ్లు కాలిపోయింది. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కోకాపేటలో జీఏఆర్ టవర్ కింది అంతస్తులో రెస్టారెంట్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. వంటగదిలో గ్యాస్ పైప్ లైన్ అమర్చే క్రమంలో.. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో యజమాని రాకేశ్, పనుల్లో ఉన్న శివ దుర్గ, రిజ్వాన్, అన్వర్ మాలిక్, ఫారూక్ మాలిక్, రాజు గాయపడ్డారు. భారీ శబ్ధం వచ్చినా మంటలు లేకపోవడం, మరోవైపు ఆరుగురు కాలిన గాయాలతో అక్కడ పడి ఉండడంతో ఘటనా స్థలం సమీపంలో ఉన్నవారికి కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే.. కోకాపేట జీఏఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరగలేదని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ వెల్లడించారు. బిల్డింగ్‌లో రెస్టారెంట్ పనులు జరుగుతున్నాయని.. గ్యాస్ లీక్ అయ్యిందని చెప్పారు. గ్యాస్ పీల్చి కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారన్నారు. వారిని వారిని ఆసుపత్రికి తరలించామని వివరించారు.
మొదట కోకాపేట జీఏఆర్ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో పలువురు ఐటీ ఉద్యోగులు గాయపడ్డారంటూ ప్రచారం జరిగింది. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. బిల్డింగ్‌లో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.