Karimnagar : లండన్ నుంచి వాట్సాప్ కాల్.. ఎమ్మెల్యేను బెదిరించి జైలు పాలైన ఎన్నారై!
Karimnagar : లండన్ నుంచి వాట్సాప్ కాల్‌లో ఎమ్మెల్యేను బెదిరించాడు. సప్త సముద్రాల దూరాన ఉన్న తనను ఎవరు ఏమి చేయలేరు అనుకున్నాడు. కానీ అనుకోకుండా కర్ణాటకకు వచ్చి పోలీసులకు చిక్కాడు. కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఓ వ్యక్తి బెదిరించాడు. గతేడాది సెప్టెంబర్ 28న +447886696497 నుండి వాట్సాప్ కాల్ చేశాడు. 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే.. రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యేలా చేస్తానని బెదిరించాడు. భయాందోళనకు గురైన ఎమ్మెల్యే సత్యం.. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఫిర్యాదుతో..
సత్యం ఫిర్యాదుతో.. 339/2024, భారతీయ న్యాయ సంహిత 308, 351(3), (4) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఎమ్మెల్యేను బెదిరించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లోని భవానినగర్‌కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) అని గుర్తించారు. అతడు లండన్ నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడని తేలింది. నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు.
కర్ణాటకకు వచ్చి..
నిందితుడు ఈనెల 9న కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు. గమనించిన కర్ణాటక ఇమ్మిగ్రేషన్ అథారిటీ అఫ్ అధికారులు.. యాస అఖిలేష్ రెడ్డి (33)ని అదుపులోకి తీసుకున్నారు. కొత్తపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తపల్లి ఎస్ఐ బెంగళూరుకు వెళ్లి నిందితుడిని కరీంనగర్‌కు తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
కోర్టు రిమాండ్ విధించడంతో.. నిందితుడిని జైలుకు తరలించిట్టు.. కరీంనగర్ రూరల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా బెదిరింపులకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టినా.. కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.
ఇంటి దొంగ అరెస్టు..
కరీంనగర్ సాయినగర్‌లోని ఓ ఇంట్లో పని చేస్తున్న వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. అత్నని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 7.45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ టూ టౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రావికంటి అఖిల్ ఈనెల 9న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి తిరుమలకు వెళ్లారు. 12వ తేదీ తెల్లవారుజామున వచ్చి చూసి.. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిల్ తండ్రికి కేర్ టేకర్‌గా పని చేస్తున్న బెజ్జంకి సంతోష్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి.. అరెస్టు చేశారు.
(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)