మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో జరిగిన ఒంటరి మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆశ్రయం ఇచ్చి, పని కల్పిస్తానని చెప్పిన పాపానికి మహిళను యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ కేసు వివరాలను డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేడ్చల్ మున్సిపాలిటీ కిష్టాపూర్‌లో ఉన్న మద్యం దుకాణంలో పని చేసే దాసరి లక్ష్మి(50).. అత్వెల్లిలో ఆరు నెలలుగా అద్దెకు ఉంటుంది. ఆమె గతంలో పటాన్‌చెరులో డంపింగ్‌యార్డులో పని చేసేది. ఆ సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె కుమారుడు కటికె రాకేశ్ జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు అలవాటుపడ్డాడు.
రాకేశ్‌కు ఏదైనా పని ఇప్పించాలని గతంలో తనకున్న పరిచయంతో లక్ష్మిని రాకేశ్ తల్లి కోరింది. దీనికి ఆమె సరే అని చెప్పింది. ఈ నెల 15న మేడ్చల్‌కు రాకేశ్ అతడి తల్లి వచ్చారు. ముగ్గురు కలిసి కల్లు తాగారు. అనంతరం రాకేశ్ తల్లి అక్కడినుంచి వెళ్లిపోయింది. రాకేశ్ లక్ష్మి తోపాటు అత్వెల్లికి వచ్చాడు. కల్లు మత్తులో ఉన్న రాకేశ్‌కు లక్ష్మి ఒంటిపైన ఉన్న నగలపై ఆశ పుట్టింది. అర్ధరాత్రి తర్వాత లక్ష్మిని వంట చేసే కత్తితో గొంతు కోసి హతమార్చాడు. లక్ష్మి ఒంటిపై నగలను తీసుకునేందుకు.. ముక్క, చెవులను కోసేశాడు.
ఈ హత్యకు సంబంధించి ఆధారాలు లేకుండా చేయాలని ఆమె ఒంటికి నిప్పటించాడు. బంగారం, డబ్బులు, సెల్‌ఫోన్‌ను తీసుకొని గదికి తాళం వేసి పరారయ్యాడు. అయితే.. ఆ గది నుంచి పొగలు రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి స్థానికుల సాయంతో గది తలుపులు తీశారు. అనుమానాస్పద స్థితిలో లక్ష్మి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా.. సీసీ కెమెరాలను పరిశీలించారు. రాకేశ్‌ను నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 5 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి, రూ.3500 డబ్బులు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన 72 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. పోలీసు సిబ్బందిని డీసీపీ కోటిరెడ్డి అభినందించారు.
సంబంధిత కథనం