Nizamabad VDC Issue: వీడీసీలపై ఉక్కుపాదం.. రిమాండ్‌కు తరలింపు
Nizamabad VDC Issue: నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలకు అడ్డుకట్ట పడుతోంది. గతంలో విచ్చల విడతనంతో విర్రవీగిన విడీసీలపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.
Nizamabad VDC Issue: నిజామాబాద్ వీడీసీ పేరుతో బహిష్కరణ మాట వినిపిస్తేనే పోలీసులు భరతం పడుతున్నారు. ఇటీవల ఒక గ్రామానికి చెందిన విడిసి సభ్యులను రిమాండ్ కు పంపగా.. తాజాగా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన వీడిసి సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
గత ప్రభుత్వం విడిసి దుశ్చర్యలపై చూసి చూడనట్టుగా వ్యవహరించింది. దీంతో విడిసిల పేరిట అడ్డూ అదుపు లేని విధంగా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం జిల్లాల పరిస్థితి మారింది. తాజా ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
దర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బాక గ్రామంలో పద్మశాలి కులానికి చెందిన సర్వేనెంబర్ 979 అసైన్డ్ భూమిని విలేజ్ డెవలప్మెంట్ కమిటి పేరుతో సొంతం చేసుకోడానికి ప్రయత్నించారు.
దీనిని అడ్డుకున్న పద్మశాలి కులానికి చెందిన 40 కుటుంబాలను బహిష్కరించి వారిపై రూ.50,000/- జరిమానా విధించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ధర్పల్లి పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపి గురువారం 5గురిని అరెస్టు చేసి నిజామాబాద్ లోని 2వ అడిషనల్ జుడిషియల్ మొదటి క్లాస్ మెజిస్ట్రేటు ముందు హాజరుపర్చడంతో న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.
అరెస్ట్ అయిన వారిలో కొత్తి రాజశేఖర్, పెండ అరుణ్ అలియాస్ అర్జున్, దొంకెన చిన్న గంగారాం, భుర్కి నర్సాగౌడ్, భూమేడ మురళి ఉన్నారు. సామాజిక బహిష్కరణలు హేయమైన చర్యలుగా భావించి వారి పై ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వీడీసీ పేరుతో జరిమానా విధించడం ఇతర కులాలను బహిష్కరించడం కులాల పేరుతో దుఖాణాలు, వాణిజ్య సంస్థలను బహిష్కరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎవరైన ఇలాంటి బహిష్కరణలు చేస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ జయరామ్ హెచ్చరించారు.
(రిపోర్టింగ్ భాస్కర్, నిజామాబాద్)