Karimnagar Fevers: కరీంనగర్‌లో విజృంభిస్తున్న విషజ్వరాలు.. డేంజర్ బెల్ మ్రోగిస్తున్న డెంగీ-poisonous fevers are booming in karimnagar dengue is ringing the danger bell ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Fevers: కరీంనగర్‌లో విజృంభిస్తున్న విషజ్వరాలు.. డేంజర్ బెల్ మ్రోగిస్తున్న డెంగీ

Karimnagar Fevers: కరీంనగర్‌లో విజృంభిస్తున్న విషజ్వరాలు.. డేంజర్ బెల్ మ్రోగిస్తున్న డెంగీ

HT Telugu Desk HT Telugu

Karimnagar Fevers: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. డెంగీ ఫీవర్ డేంజర్ బెల్ మోగిస్తుంది. సీజనల్ వ్యాధులు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి.

కరీంనగర్‌లో విస్తరిస్తున్న విషజ్వరాలు

Karimnagar Fevers: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. డెంగీ ఫీవర్ డేంజర్ బెల్ మోగిస్తుంది. సీజనల్ వ్యాధులు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ తో పాటు డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జ్వర పీడితులతో ఆసుపత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే డెంగ్యూ జ్వరంతో వేములవాడ మండలంలో ఒకరు, సుల్తానాబాద్ లో మరొకరు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.‌

రోజుకు రెండు డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో గురువారం ఒక్కరోజే మూడు కేసులు నమోదయ్యాయి. విషజ్వరాలు, డెంగీ కేసుల పట్ల వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కావలసిన మందులు, బెడ్స్ సిద్దం చేశారు.

వణికిస్తున్న వ్యాదులు...

వానకాలం నేపథ్యంలో వాతావరణ మార్పులు వచ్చి వ్యాదులు ప్రజల్ని వణికిస్తున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో జిల్లాలోని ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి పెరిగింది. గత వారం రోజులుగా రోజుకు వెయ్యి మందికి పైగా ఔట్ పేషెంట్ లు హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నారు.

ఇందులో ఎక్కువగా సీజనల్ వ్యాధుల వారే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. డాక్టర్లకు చూపించుకునేందుకు వందలాది మంది క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. వీళ్లలో చాలా మంది అడ్మిట్ అయ్యారు. జ్వర పీడితుల కోసం ఇప్పటికే రెండు వార్డులు ఉన్న ప్పటికీ పేషెంట్ల సంఖ్య పెరుగుతుండడంతో అదనపు వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి వెల్లడించారు.

ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, మందుల కొరత లేదని స్పష్టం చేశారు. జ్వరం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోని సీహెచ్ సీలు, పీహెచ్ సీల లో జ్వరం పీడితులు, సీజనల్ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు.

ఈనెలలో 18 డెంగ్యూ కేసులు నమోదు..

ఉమ్మడి జిల్లా పరిధిలో డెంగ్యూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత నెలలో 135 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈనెలలో ఇప్పటి వరకు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 18 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ లక్షణాలతో హాస్పిటల్ కు వస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

జ్వరం వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని కోరుతున్నారు. దోమల భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)