PM Modi Hyd Tour Updates : వారిపై చర్యలు చేపట్టాలా..? వద్దా..? - ప్రధాని మోదీ-pm narendra modi hyderabad tour live updates 8th april 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Pm Narendra Modi Hyderabad Tour Live Updates 8th April 2023

ప్రధాని మోదీ టూర్

PM Modi Hyd Tour Updates : వారిపై చర్యలు చేపట్టాలా..? వద్దా..? - ప్రధాని మోదీ

10:48 AM ISTHT Telugu Desk
  • Share on Facebook
10:48 AM IST

PM Modi Hyderabad Visit Updates: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కొనసాగుతోంది.సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభకు హాజరయ్యారు. లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి…..

Sat, 08 Apr 202308:43 AM IST

ముగిసిన టూర్

కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పరోక్షంగా టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. కుటుంబపాలన, అవినీతి అంటూ ఫైర్ అయ్యారు. మోదీ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ టూర్ ముగిసింది.

Sat, 08 Apr 202307:51 AM IST

కలిసి రావటం లేదు - మోదీ

కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి రావటం లేదన్నారు ప్రధానమంత్రి మోదీ. అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం అవుతోందని కామెంట్స్ చేశారు. "ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం. కానీ కొందరు అడ్డుపడుతున్నారు. కుటుంబం, అవినీతిని పోషిస్తున్నారు. తెలంగాణలో కుటంబపాలనతో అవినీతి పెరిగింది. కొందరి గుప్పెట్లోనే అధికారం మగ్గుతోంది. నిజాయితీగా పని చేస్తుంటే వాళ్లకు గిట్టడం లేదు. అలాంటి వారికి సమాజ అభివృద్ధి పట్టడం. సొంత కుటుంబం ఎదిగితే చాలని అనుకుంటారు. ఇలాంటి వారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబవాదంతో అవినీతిని పెంచుతున్నారు. అభివృద్ధికి అడ్డుతగులుతున్నారు" అంటూ బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. "అవినీతిపరులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలా..? వద్దా..? అవినీతి పోరాటంలో కలిసి వస్తారా..? నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకం అయ్యాయి. కొందరు కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా వారికి షాక్ తగిలింది అంటూ వ్యాఖ్యలు చేశారు.

Sat, 08 Apr 202307:35 AM IST

కట్టుబడి ఉన్నాం - మోదీ

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ..... తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. ప్రజలకు నమస్కారం అన్న ఆయన... తెలంగాణ, ఏపీని కలిపే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామన్నారు. కేంద్రంలో ఎన్టీఏ సర్కార్ ఏర్పడినప్పుడే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి వేగవంతం చేసే అదృష్టం తనకు దక్కిందని... రూ. 11,000 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మంది సామాన్యుల త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్ పనులు వేగవంతం చేసేందుకు కేంద్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

Sat, 08 Apr 202307:22 AM IST

అభివృద్ధి పనులకు శ్రీకారం

బీబీనగర్‌ ఎయిమ్స్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఐదు జాతీయ రహదారులకు కూడా రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు.

Sat, 08 Apr 202307:03 AM IST

కాసేపట్లో మోదీ ప్రసంగం

పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభా వేదికపై కేవలం నలుగురికి మాత్రం చోటు కల్పించారు. కాసేపట్లో ప్రధాని ప్రసంగించనున్నారు.

Sat, 08 Apr 202307:02 AM IST

అభివృద్ధి చేయటమే లక్ష్యం - కిషన్ రెడ్డి

తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ ఎంపీలం కృషి చేస్తున్నామని చెప్పారు. కిషన్ రెడ్డి ప్రసంగం తర్వాత రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. నమస్తే అంటూ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగం ప్రారంభించారు.

Sat, 08 Apr 202306:58 AM IST

జాతికి అంకితం

రూ.720 కోట్లతో సికింద్రాబాద్ ఆధునికీకరణ పనులను, సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ.

Sat, 08 Apr 202306:53 AM IST

సభా వేదికపైకి మోదీ

సభా వేదికను చేరుకున్న ప్రధాని మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు.

Sat, 08 Apr 202306:52 AM IST

పరేడ్ గ్రౌండ్ కు ప్రధాని

వందే భారత్ రైల్వే ప్రారంభం తర్వాత ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్నారు. కాసేపట్లో మోదీ ప్రసంగిస్తారు.

Sat, 08 Apr 202306:41 AM IST

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

 ప్రధాని మోదీ సికింద్రాబాద్ చేరుకున్నారు. పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు.   రైల్వే స్టేషన్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న విద్యార్థులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు.

Sat, 08 Apr 202306:27 AM IST

సికింద్రాబాద్ కు మోదీ

ప్రధాని మోదీ సికింద్రాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Sat, 08 Apr 202306:14 AM IST

స్వాగతం పలికిన గవర్నర్

ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై తో పాటు ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. కాసేపట్లో మోదీ సికింద్రాబాద్ చేరుకోనున్నారు.

Sat, 08 Apr 202306:08 AM IST

చేరుకున్న మోదీ

హైదరాబాద్ టూర్ లో భాగంగా ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం కి చేరుకున్నారు.

Sat, 08 Apr 202306:02 AM IST

నిధులు ప్రకటించండి మోదీ గారూ - షర్మిల

ప్రధాని రాకతో రాష్ట్రంలో రాజకీయ కాక మొదలైంది.  మోదీ టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ నిరసనలు చేస్తోంది. అయితే వైెస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కూడా ట్వీట్ చేశారు. “ప్రధాని శ్రీ మోదీ గారికి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోంది. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నాం” అంటూ ట్వీట్ చేశారు.

Sat, 08 Apr 202305:30 AM IST

కాసేపట్లో రాక

కాసేపట్లో ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్ వద్ద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Sat, 08 Apr 202304:35 AM IST

రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలు….

రాజీవ్‌ గాంధీ విగ్రహం జంక్షన్‌, గ్రీన్‌ లాండ్స్‌, ప్రకాశ్‌నగర్‌, రసూల్‌పురా సీటీఓ, ఫ్లాజా, ఎస్‌బీహెచ్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్డు, ఆలుగడ్డబావి, చిలకలగూడ జంక్షన్‌, ఎంజే రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్పీ రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీసులు సూచించారు. ప్రయాణికులు ఆ మార్గాల్లో జంక్షన్ల వైపు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు. ఉప్పల్‌ – సికింద్రాబాద్‌ రూట్‌లో సైతం ట్రాఫిక్‌ రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రధాని పర్యటన సమయంలో అత్యవసరం అయితే తప్ప పనులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

Sat, 08 Apr 202304:07 AM IST

షెడ్యూల్..

ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు ప్రదాని మోదీ.

11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వస్తారు.

11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.

11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.

12.37 నుంచి 12.50 మధ్య రిమోట్‌ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్‌ వీడియోల ప్రదర్శన.

12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం

1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు.

Sat, 08 Apr 202304:03 AM IST

ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉద‌యం 8:30 గంట‌ల నుంచి హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ ప‌రిస‌రాల్లో ఇవాళ ఉద‌యం 8:30 నుంచి మ‌ధ్యాహ్నం 1:30 వ‌ర‌కు వాహ‌నాల‌కు అనుమ‌తించరు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ను ఇత‌ర మార్గాల్లో మ‌ళ్లించ‌నున్నట్టు పోలీసులు తెలిపారు.

Sat, 08 Apr 202303:51 AM IST

మోదీ టూర్ 

ఇవాళ ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.