PM Modi Tour : బీజేపీ బిగ్ ప్లాన్... అక్టోబర్ 1న పాలమూరుకు మోదీ, నిజామాబాద్‌లోనూ పర్యటన!
PM Modi Telangana Tour Updates: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్ నగర్ లో తలపెట్టే పార్టీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
PM Modi Telangana Tour: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టే పనిలో పడింది. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో… బిగ్ ప్లాన్ తో ఎన్నికల యుద్ధంలోకి దిగాలని భావిస్తోంది. ఇటీవలే అమిత్ షా హైదరాబాద్ కు రాగా… వచ్చే నెల మొదటివారంలో ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. ఇప్పటికే టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు.
అక్టోబర్ 1న పాలమూరుకు ప్రధాని…
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఆచారి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ టూర్ గురించి తెలిపారు. అక్టోబరు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు పురపాలికలోని ఐటీఐ మైదానం వేదికగా మధ్యాహ్నం 1 గంటకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఈ సభ ద్వారా ఆయన రాష్ట్రంలో ఎన్నికల శంఖరావాన్ని పూరిస్తారని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా… నిజామాబాద్‌లో కూడా ప్రధాని మోదీ పర్యటన ఉండే అవకాశం ఉంది. ఇది అక్టోబరు 3వ తేదీన పర్యటిస్తారని తెలుస్తోంది. అయితే బహిరంగ సభనా లేక రోడ్ షో మాత్రమే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. నిజామాబాద్ టూర్ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
నిజానికి ఈ నెల 28, 29 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉంటుందని భావించారు. కానీ చివరికి అక్టోబరు 2న ఖరారు చేసినప్పటికీ… షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేస్తూ… 1వ తేదీన మహబూబ్ నగర్ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ఇక ప్రధాని బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేసుకునే పనిలో ఉంది. లక్ష మందికి పైగా సభకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నియోజకవర్గానికి 20 వేల మందికి తగ్గకుండా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా…. కాంగ్రెస్ కూడా త్వరలోనే జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సీడబ్ల్యూసీ భేటీతో పాటు విజయభేరి సభను నిర్వహించింది కాంగ్రెస్. గ్యారెంటీ కార్డుతో జనాల్లోకి వెళ్తోంది. ప్రధాని మోదీ సభ తర్వాత బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను వెల్లడించే ఛాన్స్ ఉంది. ప్రధాని మోదీ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని బీజేపీ తెలంగాణ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్ గా ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం ఉంది.