PM Modi Speech: 'వారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'.. పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు -pm modi speech at secunderabad parade ground in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Pm Modi Speech At Secunderabad Parade Ground In Hyderabad

PM Modi Speech: 'వారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'.. పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Apr 08, 2023 01:18 PM IST

PM Modi Hyderabad Visit: హైదరాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ (ిోమావదదక)

PM Modi Hyderabad Tour Updates: హైదరాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఉదయం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన... అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు. కాసేపు రైలులోని విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ సభకు హాజరయ్యారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ స్పీచ్ తర్వాత.... అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోదీ... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఇందులో భాగంగా బీబీనగర్‌ ఎయిమ్స్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులను ప్రారంభించారు. ఐదు జాతీయ రహదారులకు కూడా రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ..... తెలుగులో తన ప్రసంగం మొదలుపెట్టారు. ప్రజలకు నమస్కారం చెప్పిన ఆయన... తెలంగాణ, ఏపీని కలిపే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించామన్నారు. కేంద్రంలో ఎన్టీఏ సర్కార్ ఏర్పడినప్పుడే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి వేగవంతం చేసే అదృష్టం తనకు దక్కిందని... రూ. 11,000 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మంది సామాన్యుల త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్ పనులు వేగవంతం చేసేందుకు కేంద్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. ఎంఎంటీఎస్ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టామని ప్రధానమంత్రి చెప్పారు. డబ్లింగ్ పనులుతో హైదరాబాద్ - బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. కల్వకుర్తి - కొల్లాపూర్ రహదారి పనులు చేపట్టామన్నారు. “తెలంగాణలో జాతీయ రహదారులు భారీగా పెరిగాయి. తెలంగాణలో రూ. 35వేల కోట్లు రహదారులపై కఱ్చు చేశారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాలకు చేయూత అందిస్తున్నాం. టెక్స్ టైల్ పార్క్ కూడా తెలంగాణకు కేటాయించాం. దీని ద్వారా భారీగా యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఒకప్పుడు 2500 కి.మీ జాతీయ రహదారులు ఉంటే ఇవాళ 5 వేల కి.మీలకు చేరింది” అని ప్రధానమంత్రి గుర్తు చేశారు.

కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి రావటం లేదన్నారు ప్రధానమంత్రి మోదీ. అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం అవుతోందని కామెంట్స్ చేశారు. "ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం. కానీ కొందరు అడ్డుపడుతున్నారు. కుటుంబం, అవినీతిని పోషిస్తున్నారు. తెలంగాణలో కుటంబపాలనతో అవినీతి పెరిగింది. కొందరి గుప్పెట్లోనే అధికారం మగ్గుతోంది. నిజాయితీగా పని చేస్తుంటే వాళ్లకు గిట్టడం లేదు. అలాంటి వారికి సమాజ అభివృద్ధి పట్టడం. సొంత కుటుంబం ఎదిగితే చాలని అనుకుంటారు. ఇలాంటి వారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబవాదంతో అవినీతిని పెంచుతున్నారు. అభివృద్ధికి అడ్డుతగులుతున్నారు" అంటూ బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు ప్రధాని మోదీ.

"అవినీతిపరులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలా..? వద్దా..? అవినీతి పోరాటంలో కలిసి వస్తారా..? నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకం అయ్యాయి. కొందరు కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా వారికి షాక్ తగిలింది. కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కల్పిస్తాం. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 2014 నుంచి వచ్చిన మార్పును దేశమంతా చూస్తోంది. తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి. బీజేపీని ఆశీర్వదిస్తే... తెలంగాణలో మరింత అభివృద్ధి జరుగుతుంది" అని ప్రధాని మోదీ ప్రసంగించారు.

WhatsApp channel

సంబంధిత కథనం