Modi On Pawan : పవన్ అంటే పవన్ కాదు.. తుఫాన్ - ప్ర‌ధాని మోదీ ప్రశంసలు-pm modi praised janasena chief pawan kalyan at the nda parliamentary party meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Modi On Pawan : పవన్ అంటే పవన్ కాదు.. తుఫాన్ - ప్ర‌ధాని మోదీ ప్రశంసలు

Modi On Pawan : పవన్ అంటే పవన్ కాదు.. తుఫాన్ - ప్ర‌ధాని మోదీ ప్రశంసలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 07, 2024 02:05 PM IST

NDA Parliamentary Party Meeting : ఎన్డీఏ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్‌ కల్యాణ్ అంటే ఒక తుఫాన్ అని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీతో పవన్ (ఫైల్ ఫొటో)
ప్రధాని మోదీతో పవన్ (ఫైల్ ఫొటో)

NDA Parliamentary Party Meeting : ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన సమక్షంలోనే పవన్‌ కల్యాణ్‌ ఉన్నారని… పవన్‌ కల్యాణ్ అంటే ఒక తుఫాన్ అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారని చెప్పారు.

yearly horoscope entry point

చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని మోదీ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పవన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన మోదీ… పొగడ్తలు గుప్పించారు. పవన్ అంటే ఓ తుపాన్ అంటూ కామెంట్ చేశారు.

మోదీజీ.. ఈ దేశానికి నిజమైన స్ఫూర్తి మీరే - పవన్

NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "మోదీ జీ మీరు నిజంగా దేశానికి స్ఫూర్తి. మీరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం మన దేశం ఎవరికీ తలవంచదు" అని అన్నారు. మోదీజీ దిశానిర్దేశంతోనే ఏపీలో 91 శాతం పైగా సీట్లు సాధించామని చెప్పారు.

మోదీ సరైన నాయకుడు - చంద్రబాబు

భారతదేశానికి సరైన సమయంలో నరేంద్ర మోదీ సరైన నాయకుడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్లమెంట్ పాత భవనంలో ఎన్డీఏ పక్ష నేత ఎన్నిక కార్యక్రమంలో కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరపున నాయకుడిగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పాత పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్ లో జరుగుతున్న బీజేపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ డిఎ) సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ అలుపెరగని కృషి చేశారని కొనియాడారు. ఎన్నికైన ఎంపీలందరికీ అభినందనలు తెలిపిన చంద్రబాబు అద్భుతమైన మెజారిటీ సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో మూడు నెలల పాటు ప్రధాన మంత్రి ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదని, రాత్రింబవళ్లు అదే ఉత్సాహంతో ప్రచారం చేశారన్నారు. గెలుపు స్ఫూర్తితో ప్రచారం ప్రారంభించి ముగించారన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే మూడు బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించిందని, ఇది రాష్ట్రంలో ఎన్నికల్లో విజయం సాధించడంలో భారీ మార్పును తీసుకొచ్చిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమై నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎన్డీయే సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ఒంటరిగా 16 ఎంపి స్థానాలను గెలుచుకోగా, టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్ డిఎ కూటమి 25 సీట్లలో 21 స్థానాలను దక్కించుకుంది. జూన్ 9వ తేదీ ఆదివారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ సమావేశంలో మోడీకి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ తో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Whats_app_banner