PM Kusum Scheme : రైతులకు అలర్ట్, కుసుమ్ స్కీమ్ లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు-ఈనెల 22 వరకు దరఖాస్తులు-pm kusum scheme solar plants to farmers applications invited tg redco ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pm Kusum Scheme : రైతులకు అలర్ట్, కుసుమ్ స్కీమ్ లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు-ఈనెల 22 వరకు దరఖాస్తులు

PM Kusum Scheme : రైతులకు అలర్ట్, కుసుమ్ స్కీమ్ లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు-ఈనెల 22 వరకు దరఖాస్తులు

HT Telugu Desk HT Telugu
Updated Feb 08, 2025 10:31 PM IST

PM Kusum Scheme : పీఎం కుసుమ్ పథకం కింద పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు టీజీ రెడ్కో దరఖాస్తలు ఆహ్వానిస్తోంది. ఒక్కో రైతు కనిష్ఠంగా 0.5 మెగావాట్ల నుంచి గరిష్టంగా 2 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి చేసేలా పథకాన్ని ఉద్దేశించారు. ఆసక్తి కలిగిన రైతులకు బ్యాంకు రుణం మంజూరు చేయనున్నారు.

పీఎం కుసుమ్ స్కీమ్ లో రైతులకు సోలార్ పవర్ ప్లాంట్, ఈనెల 22 వరకు దరఖాస్తుకు అవకాశం
పీఎం కుసుమ్ స్కీమ్ లో రైతులకు సోలార్ పవర్ ప్లాంట్, ఈనెల 22 వరకు దరఖాస్తుకు అవకాశం

PM Kusum Scheme : పర్యావరణ సమతుల్యత పాటిస్తూ, రైతులకు ఆదాయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 'కుసుమ్' పథకాన్ని అమలు చేస్తోంది. పంట పొలాల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒక్కో రైతు కనిష్ఠంగా 0.5 మెగావాట్ల నుంచి గరిష్టంగా 2 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి చేసేలా పథకాన్ని ఉద్దేశించారు. ఆసక్తి కలిగిన రైతులకు బ్యాంకర్ల సహకారంతో రుణం మంజూరు చేయనుండగా విద్యుత్తు ఉపకేంద్రాలకు సమీపంలో భూములున్న వారికి అనుమతులిస్తారు. రైతుల నుంచి టీజీ రెడ్కో సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

డిస్కంలకు మార్గదర్శకాలు జారీ

రైతు క్షేత్రం వద్ద ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా డిస్కంలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ చేపట్టారు. రైతులు వ్యక్తిగతంగా, రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉపకేంద్రాల సమీపంలోని భూముల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఉత్పత్తి చేసిన విద్యుత్తును సులువుగా గ్రిడ్ కు అనుసంధానించే వీలుంటుంది. ఈ మేరకు దరఖాస్తుదారులకు ఏ ఉపకేంద్రం సమీపంలో ఉంటుందనే విషయంపై డిస్కం సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు.

22 వరకు దరఖాస్తు గడువు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెడ్కో అధికారులు పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 32 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో 11 మంది చొప్పున ఆసక్తి కనబరచగా ఈనెల 22 వరకు గడువు ఉండటంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సిబిల్ స్కోర్ ఆధారంగా యూనిట్ వ్యయంలో బ్యాంకులు 70 శాతం రుణం మంజూరు చేయనుండగా లబ్దిదారు 30 శాతం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆర మెగావాట్ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు రూ.1.50 కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతుండటంతో రైతులు కాస్త వెనుకడుగేస్తున్నారు.

రైతులకు అవగాహన

ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చేలా సౌర విద్యుదుత్పత్తితో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామని కరీంనగర్ రెడ్కో ఏడీవో లక్ష్మీకాతరావు తెలిపారు. ఆసక్తి కలిగిన రైతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు ఈ నెల 22 వరకు గడువు ఉందని చెప్పారు. ఈ విషయంలో దళారులను నమ్మొద్దని, సందేహాలుంటే నేరుగా రెడ్కో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ , హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం