Jagityal Flexi War: జగిత్యాలలో ఫ్లెక్సీ వార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్లెక్సీలు తొలగించిన మునిసిపల్ సిబ్బంది-plexi war in jagitya mla jeevan reddy plexi removed by municipal staff ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityal Flexi War: జగిత్యాలలో ఫ్లెక్సీ వార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్లెక్సీలు తొలగించిన మునిసిపల్ సిబ్బంది

Jagityal Flexi War: జగిత్యాలలో ఫ్లెక్సీ వార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్లెక్సీలు తొలగించిన మునిసిపల్ సిబ్బంది

HT Telugu Desk HT Telugu
Published Jul 05, 2024 06:40 AM IST

Jagityal Flexi War: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ వార్ రాజకీయంగా కలకలం సృష్టించింది.

జగిత్యాలలో ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం
జగిత్యాలలో ఫ్లెక్సీల తొలగింపుపై వివాదం

Jagityal Flexi War: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ వార్ రాజకీయంగా కలకలం సృష్టించింది. కాంగ్రెస్ నేతల మద్య వైరాన్ని బహిర్గతం చేస్తుంది.‌ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బిఆర్ఎస్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

పార్టీ పెద్దలు రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని బుజ్జగించినప్పటికీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ మధ్య ఇంకా సయోధ్య కుదరనట్టుగానే కనిపిస్తోంది. తాజాగా జగిత్యాల పట్టణంలో చోటు చేసుకున్న ఘటన అందుకు నిదర్శనంగా నిలుస్తుంది.‌

పట్టణంలోని 8వ వార్డులో బేడబుడగ జంగాల కాలనీ వాసులు బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటో ఫెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని మునిసిపల్ సిబ్బంది తొలగించారు. వెంటనే ఆయన అనుచరులు జీవన్ రెడ్డికి సమాచారం అందించడంతో జీవన్ రెడ్డి అక్కడికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు.

మూడు రోజుల తరువాత ఉన్న కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఈ రోజు ఉదయం ఏర్పాటు చేస్తే వెంటనే ఎలా తొలగిస్తున్నారంటూ ప్రశ్నించారు. మునిసిపల్ అధికారులతో ఫోన్ లో మాట్లాడిన జీవన్ రెడ్డి ఎవరు ప్లెక్సీ లు తొలగించుమన్నారని ప్రశ్నించగా టౌన్ ప్లానింగ్ అధికారి తేజస్విని అని మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యక్రమం అయిపోయిన తర్వాత తొలగిస్తే ఎవరికి అభ్యంతరం లేదని.. మూడు రోజుల్లో ఉన్న ప్రోగ్రాం కు సంబంధించిన ప్లెక్సీ ఏలా తొలగిస్తామని ప్రశ్నించారు. నిబంధనల మేరకు మెదులుకుంటే అభ్యంతరం లేదని.. ప్లెక్సీ తొలగింపు పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత జీవన్ రెడ్డి అనుచరులు, స్థానికులు ప్లెక్సీల తొలగింపుపై మునిసిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఫోటో లేనందుకే తొలగించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగిత్యాల నుంచి వెళ్లగొట్టేట్లు ఉన్నారు

జగిత్యాల అంటే జీవన్ రెడ్డి... జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అన్న బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్లెక్సీ తొలగింపు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు జగిత్యాల నుంచి వెల్లగొట్టేటట్టు కనబడుతున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. స్థానికులు, మునిసిపల్ సిబ్బందితో జీవన్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన అనుచరులు ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు కావాలనే తీయించారని స్పష్టం అవుతోందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

రాజకీయ వైరమే కారణమా..?

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బిఆర్ఎస్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్ లో చేరడంతో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఇంతకాలం జీవన్ రెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కానప్పటికీ తాజాగా ఆయన ఏర్పాటు చేసిన వాటిని తొలగించడం అందులో భాగమేనని భావిస్తున్నారు.

ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఒకప్పటి రాజకీయ ప్రత్యర్ధులు ఇప్పుడు ఒకే పార్టీ వారైనప్పటికి సయోధ్య లేదనే చర్చ సాగుతోంది. ఫ్లెక్సీలను తొలగించిన క్రమంలో స్థానికులు ఎమ్మెల్యే ఫోటో లేదన్న అంశాన్ని ప్రస్తావించడంతో అంతర్గత వైరమే అందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి, కరీంనగర్‌, హెచ్‌టితెలుగు)

Whats_app_banner