Secunderabad Railway Station : సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేత.. ఈ మార్పులు తెలుసుకోండి-platforms at secunderabad railway station closed as part of modernization work ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Secunderabad Railway Station : సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేత.. ఈ మార్పులు తెలుసుకోండి

Secunderabad Railway Station : సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేత.. ఈ మార్పులు తెలుసుకోండి

Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా.. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు మార్పులను గమనించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 100 రోజుల పాటు 6 ప్లాట్‌ఫారమ్‌లను మూసివేయనున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (పాత చిత్రం)

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు మూసివేశారు. ఆధునీకరణ నుల్లో భాగంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్‌ చేశారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 2, 3, ప్లాట్‌ఫారమ్ నంబర్ 4, 5, ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 ను మూసివేశారు. 100 రోజుల పాటు ఈ ఆరు ప్లాట్‌ఫామ్‌లు మూసివేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. పనుల కారణంగా పలు రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు.

రైళ్ల వివరాలు తెలుసుకోండి..

ప్రయాణికులు తమ రైళ్ల వివరాలను ముందుగా తెలుసుకొని.. ప్రయాణానికి సిద్ధం కావాలని అధికారులు సూచించారు. ఈ మూసివేతల కారణంగా సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్ల రాకపోకల్లో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు.. రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.720 కోట్లు వ్యయం చేయనున్నారు.

ప్రధానాంశాలు..

ఉత్తరం, దక్షిణం వైపులా అత్యాధునిక హంగులతో కూడిన టెర్మినల్ భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో భవనం జీ+3 అంతస్తులు ఉంటుంది. రెండు అంతస్తుల స్కై కాన్‌కోర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రయాణికుల కోసం దుకాణాలు, ఆహారశాలలు, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఉత్తరం వైపు మల్టీ-లెవెల్ కార్ పార్కింగ్, దక్షిణం వైపు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవి స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి.

లిప్టులు.. ఎస్కలేటర్లు..

రెండు 7.5 మీటర్ల వెడల్పు కలిగిన నడక దారులను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రయాణికులకు ఒక ప్లాట్‌ఫాం నుండి మరొక ప్లాట్‌ఫాంకు వెళ్లడానికి సులభతరంగా ఉంటుంది. స్టేషన్‌లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల కోసం విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టికెట్ కౌంటర్లు, సమాచార కేంద్రాలు, మెరుగైన టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను 2025 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పర్యావరణ అనుకూల చర్యలు..

సోలార్ పవర్ ప్లాంట్, నీటి సంరక్షణ/రీసైక్లింగ్ వంటి పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నారు. తూర్పు, పశ్చిమ మెట్రో స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లకు అనుసంధానంగా మార్గాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం, ఉత్తరం వైపు ఉన్న ప్రధాన టెర్మినల్ భవనం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. కొత్త తాత్కాలిక బుకింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ఆర్‌పిఎఫ్ భవనం నిర్మాణం పూర్తయింది. దక్షిణం వైపు బేస్‌మెంట్ నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం ఉత్తరం వైపు కొనసాగుతోంది.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం