సరస్వతీ పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తున్నారా..! దారిలో ఓరుగల్లు అందాలను కూడా చూసేయండి..-planning a trip to kaleshwaram for saraswati pushkaralu dont miss the beauty of warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సరస్వతీ పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తున్నారా..! దారిలో ఓరుగల్లు అందాలను కూడా చూసేయండి..

సరస్వతీ పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తున్నారా..! దారిలో ఓరుగల్లు అందాలను కూడా చూసేయండి..

HT Telugu Desk HT Telugu

కాళేశ్వరం వెళ్లే మార్గంలో కాకతీయుల కాలంనాటి ఆలయాలు, చారిత్రక కట్టడాలు, ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు.. ఇలా దర్శనీయ ప్రదేశాలెన్నో ఉన్నాయి. పుష్కర స్నానం కోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో కాళేశ్వరం వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న వాళ్లంతా పనిలో పనిగా.. మార్గ మధ్యలోని ఓరుగల్లు అందాలనూ చూసేయండి మరి..

కాళేశ్వరం వెళితే ఈ ప్రదేశాలు కూడా చూడండి...

కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు పుష్కర స్నానాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి.

కాళేశ్వరం వెళ్లే మార్గంలో కాకతీయుల కాలంనాటి ఆలయాలు, చారిత్రక కట్టడాలు, ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు.. ఇలా దర్శనీయ ప్రదేశాలెన్నో ఉన్నాయి. మరి వీకెండ్ వచ్చేసింది.. పుష్కర స్నానం కోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో కాళేశ్వరం వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న వాళ్లంతా పనిలో పనిగా.. మార్గ మధ్యలోని ఓరుగల్లు అందాలనూ చూసేయండి మరి..

వేయి స్తంభాల గుడి

హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి వచ్చే వాళ్లు సందర్శించేందుకు వరంగల్ నగరంలోనే కాకతీయ కాలంనాటి చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ మీదుగా వచ్చే వాళ్లకు హనుమకొండ సిటీ మధ్యలోనే కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక వేయి స్తంభాల గుడి ఉంది.

వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలో, హనుమకొండ బస్టాండ్ నుంచి 2.3 కిలోమీటర్ల దూరంలోనే ఉండే ఈ గుడిలో శిల్పకళా నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతోనే వేయి స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.

ముఖ్యంగా కాకతీయ రాజులు రహస్య సైనిక కార్యకలాపాలు సాగించడానికి ఇక్కడి నుంచి ఓరుగల్లు కోటతో పాటు రామప్పలాంటి ప్రాంతాలకు వెళ్లే రహస్య సొరంగ మార్గం కూడా ఉంటుంది. ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, ఎదురుగా నల్లరాతి శిలతో చెక్కిన నందీశ్వరుడు, కాకతీయుల కళానైపుణ్యానికి సాక్షంగా నిలిచే కల్యాణ మండపం ఉంటాయి. ఆలయ ఆవరణలో అడుగు పెడితే చారిత్రక అనుభూతి కలుగుతుంది.

భద్రకాళి దేవస్థానం

వరంగల్ నగరంలోనే మరో దర్శనీయ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు, హనుమకొండ బస్టాండ్ నుంచి 4.4 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుంది.

ఆలయ గోడలపై ఉన్న శాసనాల ప్రకారం ఆంధ్రదేశంలోని వేంగి ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా చాళుక్య రాజ్యవంశానికి చెందిన పులకేసి రాజు క్రీ.శ.625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత కాలంలో కాకతీయులు భద్రకాళి అమ్మవారిని తమ కులదేవతగా కొలిచారు. ఈ ఆలయానికి దక్షిణ భాగంలో ఒక గుహ ఉంటుంది. అందులో ఎందరో మహర్షులు తపస్సు చేసేవారని చరిత్రకారులు చెబుతుంటారు.

భద్రకాళి గుడిని ఆనుకునే పెద్ద చెరువు ఉండగా.. ఇప్పుడు దాని పునరుద్ధరణ పనులు నడుస్తున్నాయి. ఆలయానికి అవతలి వైపు ఉన్న చెరువు కట్టను భద్రకాళి బండ్ గా డెవలప్ చేశారు. ఇవతలి వైపున్న కట్టను కూడా టూరిస్టులను ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి వెళ్తే ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక అనుభూతి కలుగుతుంది.

శిల్పవనం.. ఓరుగల్లు కోట

వరంగల్ నగరంలో ప్రముఖంగా చెప్పుకోదగిన మరో చారిత్రక ప్రదేశం ఓరుగల్లు కోట. కాకతీయ రాజులు 13వ శతాబ్ధంలో తమ రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్ కు మార్చిన సమయంలో ఈ కోటను నిర్మించారు. అద్భుతమైన శిల్పకళకు, కాకతీయుల కాలంనాటి నైపుణ్యాలకు ఈ కోట సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కోటకు మూడు ప్రాకారాలున్నాయి.

ఇక్కడి మట్టి కోట, రాతికోటలు కొంతమేర శిథిలమైనా ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటాయి. ఈ కోటలపై ఉండే బురుజుల్లో ఒకప్పుడు సైనికులు సేద తీరేవారు. శత్రు సేనలు కోటలోపలికి ప్రవేశించకుండా సైన్యం నిత్యం ఇక్కడి రాత్రి, మట్టి కోట నుంచి నిఘా పెట్టేవారు.

వీటితో పాటు కోటలోని కాకతీయ కళాతోరణాలు, ఖుష్ మహాల్, ఖిలా వరంగల్ పార్కు టూరిస్టులను అమితంగా ఆకట్టుకుంటాయి. వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ కోటా 2.2 కిలోమీటర్ల దూరంలో, హనుమకొండ బస్టాండ్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలోనే ఈ వరంగల్ కోట ఉంది.

రామప్ప గుడి

వరంగల్ వైపు నుంచి కాళేశ్వరం వెళ్లే వారు దర్శించుకోవడానికి మరో చారిత్రక ఆలయం, వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన రామప్ప గుడి ఉంది. వరంగల్ నుంచి ములుగు, జంగాలపల్లి క్రాస్ మీదుగా రామప్ప చేరుకోవచ్చు. లేదా వరంగల్ నుంచి పరకాల, గణపురం నుంచి టర్న్ అయి కూడా రామప్పకు చేరుకోవచ్చు.

వరంగల్ నుంచి దాదాపు 70 కిలోమీటర్లు ఉంటుంది. అదే కాళేశ్వరం నుంచి రిటర్న్ లో వస్తే మాత్రం దాదాపు 80 కిలోమీటర్లు ఉంటుంది. కాగా వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన రామప్పలో కాకతీయుల కళా నైపుణ్యం ఉట్టిపడుతుంది. నీటిలో తేలియాడే ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

కోటగుళ్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మరో హిస్టారికల్ ప్లేస్ కోటగుళ్లు క్షేత్రం ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు కోటగుళ్లుగా పేరుగాంచాయి. ఇక్కడ మొత్తంగా వివిధ పరిమాణాల్లో 22 ఆలయాలు ఉండగా.. కాకతీయుల నిర్మాణ శైలి, కళా నైపుణ్యానికి ఈ కోటగుళ్లు అద్దం పడతాయి. కాగా కాళేశ్వరం నుంచి ఈ కోటగుళ్లు దాదాపు 67 కి.మీల దూరంలో ఉంటాయి.

లక్నవరం చెరువు

ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు మండు వేసవిలోనూ కేరళ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇది వరంగల్ సిటీ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ములుగు గోవిందరావుపేట మండలం లోని బుస్సాపూర్ మీదుగా లక్నవరం చేరుకోవచ్చు. చుట్టూ గుట్టల నడుమ ఉండే ఈ చెరువు ద్వీపాన్ని తలపిస్తుంది.

ఇక్కడ రెండు వైపులా ఏర్పాటు చేసిన వేలాడే వంతెనలు ఆకట్టుకుంటాయి. చుట్టూ కొండలు, చెట్లు, వంతెన కింద నీళ్లు.. కోనసీమ, అరకు, కేరళ అనుభూతిని కలిగిస్తాయి. సరస్సులో బోటు షికారుతో పర్యాటకులు ఎంజాయ్ చేయొచ్చు. లక్నవరం సరస్సు కాళేశ్వరం నుంచి దాదాపు 104 కి.మీలు ఉంటుంది.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం