భూ భారతిపైనే రైతుల ఆశలు - వెంకటాపూర్ మండలంలో అందుబాటులోకి సేవలు-pilot project of the bhu bharathi portal is being implemented in venkatapuram mandal in mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  భూ భారతిపైనే రైతుల ఆశలు - వెంకటాపూర్ మండలంలో అందుబాటులోకి సేవలు

భూ భారతిపైనే రైతుల ఆశలు - వెంకటాపూర్ మండలంలో అందుబాటులోకి సేవలు

HT Telugu Desk HT Telugu

భూ భారతి పోర్టల్ ను ములుగు జిల్లాలోని వెంకటాపుర్ మండలంలో అమలు చేస్తున్నారు. ఈ మండలంలో మొత్తంగా 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 31,102 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, 13,533 మంది రైతులు సాగు చేస్తున్నారు. భూ భారతి రాకతో మండల పరిధిలోని రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.

వెంకటాపూర్ మండలంలో భూ భారతి సేవలు

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘భూ భారతి’ పోర్టల్ అమలులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు, వివాదాలు పేరుకుపోగా.. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతితో వాటన్నింటికీ పరిష్కారం దొరుకుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.

రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూ భారతిని అమలు చేస్తుండగా.. అందులో నారాయణపేట జిల్లా మద్దూరు, కామారెడ్డి జిల్లా లింగంపేట, ఖమ్మం జిల్లా నేలకొండపల్లితో పాటు ములుగు జిల్లా వెంకటాపూర్ కు స్థానం దక్కింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క) ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయగా.. మండలంలోని రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

వెంకటాపూర్ స్వరూపం ఇదీ..

ములుగు జిల్లాలో తొమ్మిది మండలాలు ఉండగా.. అందులో వెంకటాపూర్ ఒకటి. దాదాపు 74,667 ఎకరాల మేర ఈ మండలం విస్తరించి ఉండగా.. ఈ మండలంలో మొత్తంగా 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 31,102 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, 13,533 మంది రైతులు సాగు చేస్తున్నారు.

భూభారతిపైనే ఆశలు

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన భూ భారతిపై వెంకటాపూర్ మండల రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అమలులోకి తీసుకురావడంతో ఇక్కడ చాలాచోట్లా భూ సమస్యలు బయటపడ్డాయి. ప్రధానంగా రైతులు ఒకచోట భూమి సాగు చేసుకుంటుంటే సర్వే నెంబర్ మరో చోట, ఒక రైతు సర్వే నెంబర్ లో మరో రైతు పేరు మీద భూమి నమోదు కావడంతో వివాదాలు తలెత్తాయి. అంతేకాకుండా సరైన పత్రాలు లేక రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

వాసరత్వ పట్టాల సమస్య కూడా ఇక్కడే అధికంగా ఉంది. వెంకటాపూర్ తహసీల్దార్ ఆఫీస్ లో ప్రజావాణికి సంబంధించిన దాదాపు 60 కి పైగా ఫిర్యాదులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నట్టు తెలిసింది. కాగా ఇప్పుడు ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించే అవకాశం ఉందని, వెంకటాపూర్ మండల రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

17 నుంచి గ్రామాలకు ఆఫీసర్లు

క్షేత్రస్థాయిలో మే 31లోగా భూసమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. దీంతో గురువారం నుంచి రెవెన్యూ అధికారులు వెంకటాపూర్ మండలంలోని గ్రామాలను సందర్శించనున్నారు. మిగతా జిల్లాల్లో కూడా 17వ తేదీ నుంచి అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎమ్మార్వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలను భూభారతి పోర్టల్ పై ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేశారు.

కాగా గురువారం నుంచి రెవెన్యూ ఆఫీసర్లు గ్రామాలను విజిట్ చేయనుండగా.. వివాదాలు నెలకొన్న భూములకు సంబంధించిన అన్ని దస్త్రాలు రైతులు అందుబాటులో ఉంచుకోవాలని, గ్రామ సందర్శనకు వచ్చిన ఆఫీసర్లకు సమస్యలను వివరించాలని ఉన్నతాధికారులు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని అందుబాటులోకి తీసుకురావడంతో రైతులతో కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వెంకటాపూర్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

HT Telugu Desk

సంబంధిత కథనం