TSPSC Group1: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్లు-petitions in high court to stop group 1 prelims in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Petitions In High Court To Stop Group 1 Prelims In Telangana

TSPSC Group1: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్లు

HT Telugu Desk HT Telugu
Jun 02, 2023 06:58 AM IST

TSPSC Group1: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ పేపర్‌ లీక్ వ్యవహారంపై సిట్ దర్యాప్తుతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. టిఎస్‌పిఎస్సీ నిర్వహణపై అనుమానాలను పిటిషనర్లు వ్యక్తం చేశారు.

గ్రూప్1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని పిటిషన్
గ్రూప్1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని పిటిషన్

TSPSC Group1: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో 'సిట్‌' దర్యాప్తుతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

పేపర్‌ లీక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ మళ్లీ పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం ఉందని, యూపీఎస్సీ లాంటి మూడో సంస్థకు పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని పిటిషనర్లు కోరారు. గత ఏడాది అక్టోబరులో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతోపాటు ఈనెల 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ జారీచేసిన వెబ్‌నోట్‌ను రద్దు చేయాలని కోరుతూ అశోక్‌కుమార్‌‌తో పాటు మరో నలుగురు, టి.రమేశ్‌, జె.సుధాకర్‌లు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు.

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ రద్దు చేయాలనే పిటిషన్లపై గురువారం జస్టిస్‌ కాజా శరత్‌ విచారణ చేపట్టారు.గత ఏడాది పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్‌ అయిన విషయం వెలుగులోకి వచ్చిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్‌ చేసిందని, ఈ సంఖ్య 100కు చేరవచ్చని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివరించారు. సిట్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దు చేసి తాజాగా నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిందన్నారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నందున, పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగించాలని కోరారు.

ఈ కేసులో ఓవైపు దర్యాప్తు జరుగుతోందని, నిందితులంతా ఇంకా బయటపడలేదని, అయినా పరీక్ష నిర్వహించడానికి కమిషన్‌ సిద్ధపడుతోందన్నారు. కేవలం ఎన్‌ఆర్‌ఐల కోసం హడావుడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. పరీక్షలకు సంబంధించి 5 లక్షల మంది ఆశావహులు ఉన్నారన్నారు. పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ లీకేజీ వ్యవహారంలో 49 మంది ఉద్యోగులు లేరని, కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. దీనికి బాధ్యులైనవారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ, రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అధికారి, అసిస్టెంట్‌ కంట్రోలర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు.

IPL_Entry_Point