TGPSC Group 1 Mains : మళ్లీ హైకోర్టుకు చేరిన గ్రూప్ 1 పంచాయితీ.. సింగిల్ బెంచ్‌ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్-petition in telangana high court on tgpsc group 1 mains exams again ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Mains : మళ్లీ హైకోర్టుకు చేరిన గ్రూప్ 1 పంచాయితీ.. సింగిల్ బెంచ్‌ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్

TGPSC Group 1 Mains : మళ్లీ హైకోర్టుకు చేరిన గ్రూప్ 1 పంచాయితీ.. సింగిల్ బెంచ్‌ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్

Basani Shiva Kumar HT Telugu
Oct 17, 2024 10:52 PM IST

TGPSC Group 1 Mains : తెలంగాణలో గ్రూప్ 1 పంచాయితీ మళ్లీ హైకోర్టుకు చేరింది. ఈనెల 15న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ముగ్గురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. దీంతో మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ ఉన్నత న్యాయస్థానం
తెలంగాణ ఉన్నత న్యాయస్థానం

గ్రూప్‌ 1 ఇష్యూ మళ్లీ హైకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలైంది. ఈనెల 15న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. సింగిల్ బెంచ్‌ తీర్పును ముగ్గురు అభ్యర్థులు సవాల్ చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు సింగిల్ బెంచ్ డిస్మిస్ చేసింది. రెండు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని అధికారులు ప్రకటించారు. సింగిల్ బెంచ్ తీర్పు వచ్చిన రెండ్రోజుల తర్వాత అభ్యర్థులు మళ్లీ కోర్టు మెట్లెక్కారు.

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసింది. https://hallticket.tspsc.gov.in ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, క్యాప్చా ఎంటర్ చేస్తే.. పీడీఎఫ్ ఫార్మాట్‌లో హాల్ టికెట్ డౌన్ లోడ్ అవుతోంది.

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు మొత్తం 31 వేల 382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి.

గ్రూప్-1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్‌లో భాగంగా ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పేపర్‌ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

Whats_app_banner