Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్.. కారణం ఇదే!
Indiramma Atmiya Bharosa : భూమిలేని నిరుపేద కూలీల కోసం.. రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏడాదికి రూ.12 వేలు అర్హులకు అందివ్వనున్నారు. అయితే.. ఈ పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రేవంత్ ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. ప్రారంభించిన మరుసటి రోజే ఈ పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

కారణం ఏంటీ..
ఈ పథకాన్ని కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు మాత్రమే వర్తింపజేస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయని పిటిషనర్ న్యాయస్థానానికి వివరించారు. పట్టణాలు, పురపాలికల్లో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. దీంతో 129 పురపాలికల్లో దాదాపు 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు నష్టపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో ఉన్న వారికే పథకాన్ని వర్తింపజేయడం సరైంది కాదన్నారు.
సీఎస్‌కు హైకోర్టు ఆదేశాలు..
కేవలం గ్రామాల్లోని వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. ఆత్మీయ భరోసా పథకం అమలుపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఎవరు అర్హులు..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం పథకానికి సంబంధించి నిబంధనలు ఇలా ఉన్నాయి.
1.ధరణి పొర్టల్‌లో తమ పేరుపై భూమి లేని వారు.
2.ఉపాధి హామీ జాబ్‌కార్టు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి.
3.బ్యాంకు పాస్‌బుక్‌లకు ఆధార్ కార్డు లింక్ తప్పనిసరిగా ఉండాలి.
4.2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలి.
5.గ్రామపంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు.
10 లక్షల మందికి లబ్ధి..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 29 లక్షల మంది కూలీలకు వ్యవసాయ భూమి లేదు. మరోవైపు ఏడాదిలో కనీసంగా 20 రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. దాని ప్రకారం ఉపాధి హామీ పథకంలో భాగంగా.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 లక్షల మంది కూలీలు 20 రోజుల పాటు పనిచేసినట్లు వెల్లడైంది. ఈ లెక్కన లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేయడానికి ఏటా రూ.1200 కోట్ల మేరకు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.