Pet Dogs : మనుషుల విశ్వాసం ఇదే.. మీకు అర్థమయిందా?-pet dogs on hyderabad roads after covid 19 here is reasons ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Pet Dogs On Hyderabad Roads After Covid 19 Here Is Reasons

Pet Dogs : మనుషుల విశ్వాసం ఇదే.. మీకు అర్థమయిందా?

Anand Sai HT Telugu
Oct 11, 2022 02:37 PM IST

Pet Dogs In Hyderabad : భాగ్యనగరంలో అలా రోడ్లమీదకు వెళ్లండి. ఈ మధ్య కాలంలో మంచి హైబ్రిడ్ శునకాలు కనిపిస్తుంటాయి. అరే చూసేందుకు ముద్దుగా బొద్దుగా ఉంది కదా అనుకుంటారు. రోడ్డుపై ఎందుకు వదిలేసి ఉంటారబ్బా అని ఎప్పుడైనా అనుకున్నారా? మీరు అనుకునేదాంట్లో కింద చెప్పే కారణం కూడా ఉండొచ్చు.

శునకం
శునకం

ఇంట్లో ఎవరూ మీతో ఉన్నా లేకపోయినా.. ఒక్కసారి మీరు కాస్త తిండిపెడితే చాలు చచ్చిపోయేంత వరకూ మీకు తోడుగా ఉంటాయి శునకాలు(Dogs). ఒంటరితనాన్ని దూరం చేసే జీవులు అవి. మీరు కనపడకపోతే అల్లాడిపోతాయి. కరోనా సమయంలో ఎంతో మందికి తోడుగా ఉన్నాయి. నాతో ఓ జీవి బతికే ఉందని..శునకాన్ని చూసి కరోనా(Corona) వచ్చిన వాళ్లు ఎంతమంది అనుకున్నారో కదా. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. అప్పుడు ప్రేమగా చూసుకున్న శునకాలు ఇప్పుడు ఒంటరి అయ్యాయి. ఎవరూ తోడుగా లేనప్పుడు అండగా నిలిచిన కుక్కలు ఇప్పుడు ఏ తోడూ లేకుండా రోడ్ల మీదకు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

కరోనా సమయంలో సామాజిక ఒంటరితనం కారణంగా కుక్కలను చాలామంది దత్తత తీసుకున్నారు. హైదరాబాద్(Hyderabad)లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. బ్లూ క్రాస్‌(blue cross)తో సహా అనేక పెంపుడు జంతువుల దత్తత సంస్థల ప్రకారం, ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితం కావడంతో జంట నగరాల్లో పెంపుడు జంతువులను, ముఖ్యంగా కుక్కలను దత్తత తీసుకోవడానికి డిమాండ్ పెరిగింది.

కొవిడ్-19(Covid 19) మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో కుక్కలు, పిల్లులు వాటి యజమానులు అనుభవించే ఒంటరితనాన్ని దూరం చేశాయి. ఆందోళనను తగ్గించడంలో సహాయపడ్డాయి. లాక్‌డౌన్(Lock Down) సమయంలో ఇళ్లకే పరిమితమై మానసిక క్షోభను అనుభవించిన చాలామంది వాటిని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టింది. పరిస్థితులు మారాయి.

మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో చాలామంది శునకాలను తిరిగి ఇవ్వడం లేదా వదిలివేశారు. జంతు సంక్షేమ సంస్థల లెక్కల ప్రకారం.. సరైన గణాంకాలు లేవు. కానీ పెంపుడు జంతువులను విడిచిపెట్టడంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజలు బిజీగా అయ్యారని వాటిని పట్టించుకునేందుకు సమయం లేదని జంతు హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

పిల్లులు(Cats), కుక్కలు ఆప్యాయత కోరుకుంటాయి. అయితే మనుషులు మాత్రం వారి ఆడంబరం, లేదా కరోనా లాంటి సమయాల్లో అవసరం కోసం మాత్రమే వాడుకుంటారని జంతు ప్రేమికులు సీరియస్ అవుతున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పెంపుడు జంతువుల(Pet Animals) విక్రయాలు, ముఖ్యంగా కుక్కల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మాత్రం.. చాలా శునకాలు రోడ్డు మీద కనిపిస్తున్నాయి.

'మనం ఒత్తిడి, టెన్షన్‌లో ఉన్నామన్న విషయాన్ని కూడా కుక్కలు పసిగడతాయి. చెమట వాసన, శ్వాస నుంచి ఒత్తిడిని పసిగడతాయని ఇప్పటికే అధ్యయనాల్లో తేలింది. ఎవరూ లేనప్పుడు అదే మీకు పెద్ద రిలీఫ్. మీరు పిలవకపోయినా.. కొన్నిసార్లు అలుగుతాయి. కరోనా సమయంలో ఎంతోమందికి తోడుగా నిలిచాయి. అలాంటి వాటిని కొంతమంది రోడ్ల మీదకు ఎలా వదిలేస్తారు.' అని హైదరాబాద్ కు చెందిన ఓ జంతు ప్రేమికుడు ప్రశ్నించాడు.

IPL_Entry_Point