గతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అంతేనా.. లోకల్ కార్పోరేటర్ మొదలు.. ఆఫీసర్ల వరకు లంచాలు ఇవ్వందే పర్మిషన్ రాదు. అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూర్చున్న చోటు నుంచే ఇంటి నిర్మాణ అనుమతి పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. నూతన నిర్మాణ అనుమతుల విధానం బిల్డ్ నౌతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.
సెల్‌ఫోన్ లోనే బిల్డ్ నౌ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు పరిశీలించి గరిష్ఠంగా 15 రోజుల్లోపు అనుమతి ఇస్తారని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ఇంటి స్థల విస్తీర్ణం 75 గజాల్లోపు ఉంటే దరఖాస్తును సమర్పించగానే అనుమతి వచ్చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని మొదట జీహెచ్‌ఎంసీ పరిధిలో మార్చి 10 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
దీంట్లో దరఖాస్తు చేసుకోవడానికి భవన నిర్మాణానికి ఆర్కిటెక్ట్‌లు రూపొందించే డ్రాయింగే ప్రామాణికం. ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ పరిశీలనకు కొన్ని వారాల సమయం పడుతోంది. బిల్డ్ నౌ ద్వారా అది నిమిషాల్లోకి తగ్గనుందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీడీసీపీ, ఇతర స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపకశాఖ, నీటిపారుదలశాఖ, రెవెన్యూ, మూసీ నది అభివృద్ధి సంస్థ, తదితర శాఖలన్నీ బిల్డ్ నౌతో అనుసంధానమై ఉంటాయి.
దరఖాస్తు, వాటి స్థితి, ఏ అధికారి వద్ద పెండింగులో ఉంది, ఇతరత్రా వివరాలను దరఖాస్తుదారులు తెలుసుకోవచ్చు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది. సామాన్యుడు కూడా తనకున్న ఇంటి స్థలంలో ఎన్ని అంతస్తులు కట్టుకోవచ్చు, సెట్ బ్యాక్ ఎంత వదలాలి, దరఖాస్తు విధానం గురించి వెబ్‌సైట్‌లోనే వివరాలు తెలుసుకోవచ్చు. మనం ప్రశ్న అడిగితే.. ప్రభుత్వ ఉత్తర్వులు, వాటి నిబంధనలతో సూచనలు వస్తాయి. డ్రాయింగ్ ప్రకారం.. 3డీ ఇంటి నమూనాలను కూడా చూడొచ్చు.
ఈ వ్యవస్థ ద్వారా అనుమతుల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్డ్ నౌ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జీహెచ్‌ఎంసీ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. దీని ద్వారా పౌరులకు సౌకర్యవంతమైన సేవలను అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. మార్చి 10వ తేదీన అందుబాటులోకి వచ్చాక దీని పని విధానం పూర్తిగా తెలియనుంది.