ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా.. దానికి రేషన్ కార్డు ఉండాలనే షరతు విధిస్తోంది. ఫలితంగా వేలాది మంది లబ్ధి పొందలేకపోతున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. రేషన్ కార్డులో పేరు లేని కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోవడం లేదు. కొత్త కార్డు కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు. దీంతో చాలామంది నష్టపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. చాలామందికి పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో నూతన జంటలు తమతమ కుటుంబాలకు రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించుకున్నారు. కొత్త కార్డుల కోసం అప్లై చేశారు. కానీ అవి ఇప్పటివరకు రాలేదు. గత ప్రభుత్వంలో వీటి ఊసే లేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించింది. మళ్లీ మీసేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. కానీ కొత్త కార్డులు ఇంకా జారీ చేయలేదు.
ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికం చేయడంతో.. కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా.. చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్‌కార్డు నుంచి పేర్లు రద్దు చేసుకుని.. కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్‌కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో వారి పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే.. ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా ఉంది.
పాత రేషన్‌కార్డులో పేరు డిలీట్ కావడంతో.. ప్రభుత్వం అందించే ఇతర పథకాలు సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా.. లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు.
సంబంధిత కథనం