Warangal : డంప్ యార్డును తరలించాలని ఉద్యమం.. మూడు గ్రామాల ప్రజల పోరాటం!-people of 3 villages in warangal district launch movement to move dump yard ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : డంప్ యార్డును తరలించాలని ఉద్యమం.. మూడు గ్రామాల ప్రజల పోరాటం!

Warangal : డంప్ యార్డును తరలించాలని ఉద్యమం.. మూడు గ్రామాల ప్రజల పోరాటం!

HT Telugu Desk HT Telugu
Jan 27, 2025 06:01 PM IST

Warangal : వరంగల్ నగరంలోని డంప్ యార్డును తరలించాలని.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉద్యమం చేపట్టారు. డంప్ యార్డులోని చెత్త తగులబడి రోజుల తరబడి కాలుతుండటం, దాని నుంచి వచ్చే పొగ చుట్టుపక్కల గ్రామాలను కమ్మేస్తుండటంతో.. ఈ పోరాటం మొదలు పెట్టారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

డంప్ యార్డును తరలించాలని ఉద్యమం
డంప్ యార్డును తరలించాలని ఉద్యమం

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 66 డివిజన్లు, 2.25 లక్షల వరకు ఇళ్లు ఉన్నాయి. 11 లక్షల వరకు జనాభా ఉంది. ప్రతి రోజు గ్రేటర్ వరంగల్ పరిధి నుంచి 450 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడి చెత్త వస్తోంది. 2007లో మడికొండ శివారులోని దాదాపు 32 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ డంప్ యార్డులో దాదాపు 7 లక్షల టన్నుల వరకు వ్యర్థాలు పోగయ్యాయి. అందులో 3 లక్షల టన్నుల వరకు చెత్తను బయో మైనింగ్ ద్వారా శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 2021 లోనే రూ.36 కోట్లతో బయోమైనింగ్‌కు శ్రీకారం చుట్టారు. కానీ ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రోజురోజుకు డంప్ యార్డులో చెత్త గుట్టలుగా పెరిగిపోతోంది.

yearly horoscope entry point

కమ్మేస్తున్న పొగ..

డంప్ యార్డులో గతంలో పోగైన 3 లక్షల టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా శుద్ధి చేసే పనులు నడుస్తున్నాయి. కొత్తగా పోగవుతున్న చెత్తతో సమస్య తీవ్రం అవుతోంది. కొత్త చెత్తను డంప్ చేసేందుకు వేరే మార్గం లేదు. దీంతో అందులో ఉన్న చెత్త మొత్తం గుట్టలుగా పేరుకుపోతోంది. అందులో మంటలు వ్యాప్తి చెందుతున్నాయి.

రోగాలు వస్తున్నాయ్..

మంటల్లో నుంచి వచ్చే పొగ చుట్టుపక్కల గ్రామాలను కమ్మేస్తోంది. ప్రతిరోజు రాత్రి డంప్ యార్డు నుంచి వచ్చే పొగ.. మడికొండ, టెక్స్ టైల్ పార్క్, రాంపూర్, ఎల్కుర్తి, మోడల్ కాలనీ, రింగ్ రోడ్డు పరిసరాలను కమ్మేస్తోంది. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇదే సమస్య కొన్నేళ్లుగా వేధిస్తోంది. దీంతో మడికొండ, రాంపూర్ గ్రామస్థులు తరచూ రోగాల బారిన పడుతున్నారు.

ప్రజల ఉద్యమం..

డంప్ యార్డు సమస్య ముఖ్యంగా మడికొండ, రాంపూర్ గ్రామాలకు ఎక్కువగా ఉంటుంది. దీంతో డంప్ యార్డును ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని దాదాపు దశాబ్ధ కాలంగా రాంపూర్, మడికొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకు ప్రభుత్వ పెద్దలకు సమస్యను వివరించి.. చాలా సందర్భాల్లో వినతి పత్రాలు అందజేశారు. అయినా పాలకులు పట్టించుకోలేదు. ఇప్పటికీ డంప్ యార్డు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులకు వినతి..

తమ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం, పాలకులు పట్టించుకోకపోవడంతో.. మడికొండ, రాంపూర్, ఎలుకుర్తి గ్రామాల ప్రజలు ఉద్యమానికి పూనుకున్నారు. ఇప్పటికే దాదాపు 40 మందితో కమిటీ వేసి ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 19న మడికొండలో అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. సోమవారం మడికొండలో ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రాలు అందించారు. మడికొండ డంప్ యార్డును అక్కడి నుంచి తరలించాలని.. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner