జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఆడ పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలోని అన్నారం క్రాస్ బీరసాగర్ పోచమ్మ ఆలయం వద్ద రెండు రోజుల కిందట కొంతమంది వాహనదారులు పులిని చూసినట్టు చెబుతున్నారు. అటుగా వచ్చిన పులిని గమనించి, గ్రామస్థులకు సమాచారం చేరవేయగా.. ఆ విషయం కాస్త వైరల్ అయ్యింది.
గ్రామస్థులు సంబంధిత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. పులి జాడను కనుగొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా పులి పాద ముద్రలను గుర్తించారు. మహదేవపూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది ఆడ పులిగా భావిస్తున్నారు. పులిని గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తరచూ పులి కదలికలతో మహదేవపూర్ మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఓ వైపు మహదేవపూర్ ఏజెన్సీ ఏరియాలో ఆడపులి సంచరిస్తుండగా.. భూపాలపల్లి, కాటారం మండలాల్లో మగపులి తిరుగుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం పులి కదలికలను గుర్తించిన కొందరు స్థానికులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వెంటనే జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు కాటారం, భూపాలపల్లి మండలాల్లో పర్యటించారు. అక్కడున్న పులి అడుగులను గుర్తించి, దానిని మగపులి గా భావిస్తున్నారు.
మొదట మహదేవపూర్, కాటారం మండలాల్లో సంచరించేది ఒకటే పులి అని భావించారు. కానీ అక్కడున్న అడుగులు, ఇక్కడున్న అడుగులకు సరిపోలకపోవడంతో రెండు పులులు సంచరిస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. కాటారం మండలంలో పులి అడుగులు గుర్తించి, అది మగపులిగా తేల్చారు. ఆ పులి కాటారం మండలం మేడిపల్లి, కొత్తపల్లి మీదుగా భూపాలపల్లి మండలం రాంపూర్, కమలాపూర్ గ్రామ శివార్లలో సంచరిస్తుండటంతో.. అటు గ్రామస్థులతో పాటు ఆఫీసర్లు కూడా అలర్ట్ అయ్యారు.
జిల్లాలో రెండు వైపులా రెండు పులులు సంచరిస్తుండటంతో కాటారం, మహదేవపూర్ మండలాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. జనాలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. కనీసం పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా భయాందోళన చెందుతున్నారు. పులుల సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేసే పనిలో పడ్డారు. అటవీ ప్రాంతాల్లోకి పశువుల కాపరులు ఎవరూ వెళ్లొద్దని సూచిస్తున్నారు.
పంట పొలాల వద్ద కరెంట్ తీగలు, ఉచ్చులు పెట్టొద్దని, ఒకవేళ ఎవరైనా పులులను హాని కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఎవరికైనా పులి ఎదురైతే దాని కళ్లలోకి నేరుగా చూడొద్దని, వెనక్కి తిరగకుండా వెనక్కి నడవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పరుగెత్తకూడదని, పెద్ద శబ్ధం చేస్తూ ఉండాలని సూచించారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)