Adilabad : రోడ్డుపై పులి గాండ్రింపు.. బెదిరిపోయిన వాహనదారులు.. ఆందోళనలో ప్రజలు
Adilabad : పులులు ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. ఇన్నాళ్లు అడవుల్లో తిరిగిన పులులు.. ఇప్పుడు నడిరోడ్డుపై గాండ్రిస్తున్నాయి. తాజాగా ఓ చిరుత రోడ్డుపై కూర్చొని వాహనదారులను భయపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే పులి దాడిలో ఓ మహిళ మృతిచెందింది.
పులుల సంచారంతో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. ఓ చిరుత పులి బైపాస్ రోడ్డుపై కూర్చూని గాండ్రించింది. దీంతో వాహనదారులు ఆందోళన చెందారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పులుల సంచారం పెరిగిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మహిళ మృతి..
నవంబర్ 29న ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో మహిళ మృతి చెందింది. కాగజ్‌నగర్ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతురాలు మోర్లె లక్ష్మిగా గుర్తించారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్, వాంకిడి మండలాల్లోనూ పులి పశువులపై దాడి చేసింది. ఈ సంఘటనను మర్చిపోకముందే కాగజ్ నగర్ మండలంలో పులి దాడిలో మహిళ మృతి చెందింది. దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులుల దాడుల నుండి కాపాడాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.
అటు బోథ్ మండలం బాబెర తాండలో చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. ఇటీవల అర్ధరాత్రి మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో నాలుగు మేకల మృతి చెందాయి. మేకల అరుపులకు గ్రామస్థులు మేల్కొన్నారు. గ్రామస్తుల అలికిడితో చిరుతపులి పారిపోయింది. చిరుతపులి సంచారంతో గ్రామస్థులు భయభ్రంతులకు గురవుతున్నారు.
పులుల సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో పశువుల కాపారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఉదయం 9 గంటల వెళ్లి 4 గంటల లోపు పనులు ముగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కర్రకు గజ్జెలు కట్టి శబ్దం, అరుపులు చేస్తూ వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. అటవీ ప్రాంతానికి అర కిలోమీటరుకు మించి వెళ్లరాదని, పంటల రక్షణకు కంచెలు ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పులి సరిహద్దు దాటే వరకు పశువులను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లద్దని సూచించారు.
పులులకు హాని కలిగించొద్దు..
పులుల సంచారం నేపథ్యంలో.. ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. పులులకు ఎలాంటి హాని కలిగించొద్దని సూచించారు. కరెంట్ షాక్, ఇతర ఆయుధాలతో పులులకు హాని కలిగిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు.