AP TS Weather Updates: ఏపీ, తెలంగాణలను వానలు పలకరించాయి. బుధవారం ఉదయం వరకు దోబుచులాడిన మేఘాలు మధ్యాహ్నానికి కరునించాయి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పగలు ఎండలు మండిపోయినా సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురివాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల బుధవారం వానలు ముంచెత్తాయి. అత్యధికంగా అన్నమయ్య జిల్లా ములకలచెరువులో 131.75 మి.మీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు హడలెత్తించాయి. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. నైరుతి రుతుపవనాల్లో కొంత కదలిక మొదలైంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు బుధవారం కూడా కావలి ప్రాంతంలోనే కొనసాగుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నైరుతితో పాటు దాన్ని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం.. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.
వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఉపరితల ఆవర్తనం మూడు, నాలుగు రోజుల్లో అల్పపీడనంగా మారొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అటు తెలంగాణకు కూడా రుతుపవనాలు కదిలాయి. ఇన్నాళ్లు ఎండల వేడి, ఉక్కపోతలతో అల్లాడిన రాష్ట్రంపై వరుణుడు కరుణించాడు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జనగామ జిల్లా మల్కాపూర్‌లో అత్యధికంగా 8.2, స్టేషన్ ఘన్‌పూర్‌లో 6.9, కల్వకుర్తిలో 5.8, మాడుగులపల్లిలో 5.1, హనుమకొండలో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తెలంగాణలో గురువారం నుంచి అయిదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని, వానలు కురిసే తీరును బట్టి నైరుతి రుతుపవనాలు గురువారం తెలంగాణలో విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. 'వరుసగా రెండు రోజులు అత్యధిక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతోపాటు అవి కొనసాగే అవకాశాలను పరిశీలించి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రుతుపవనాల ఆగమనాన్ని సూచించే చల్లని గాలులు వీస్తున్నట్లు వివరించారు. మరోవైపు వేసవి ఎండల తీవ్రత బుధవారం కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగింది. అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో వర్షాలు ప్రారంభంకావడంతో ప్రజలతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థ లకు కూడా ఊరటనిచ్చింది. ఎండల వేడి తీవ్రత కారణంగా జూన్‌లో కూడా విద్యుత్ వినియోగం తగ్గలేదు. బుధవారం మధ్యాహ్నం రెండున్నరకు రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండు 11,256 మెగావాట్లు ఉంటే సాయంత్రానికి వర్షాలు ప్రారంభం కావడంతో రాత్రి 8 గంటలకు 7,599 మెగావాట్లకు తగ్గిపోయింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, అమీర్‌పేట, లక్డీకాపూల్, సికింద్రాబాద్ పరేడ్ మైదానం, పాతబస్తీ బహదూర్‌పురా, ఫలక్ నుమా, చంద్రాయణగుట్ట, కాలపత్తర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, సంతోష్ నగర్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వివిధ పనుల మీద బయటకు వచ్చిన వారు తడిసి ముద్దయ్యారు. కొన్ని చోట్ల రహదారులపై నీరు నిల్వడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.