Warangal BRS: బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లను టచ్ చేస్తే.. కాంగ్రెస్ ఆఫీస్ లను కూడా టచ్ చేయాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ పరిధి బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు గులాబీ పార్టీ నేతలు స్పందించారు. అదే పార్టీ ఆఫీస్ లో గురువారం ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, వరంగల్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికి ఎవరూ రావొద్దని, వచ్చి టార్గెట్ కావొద్దని అన్నారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి అప్పుడున్న నామినల్ రేట్ ప్రకారం స్థలం ఇచ్చారని, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బోయినపల్లి మెయిన్ రోడ్డులో 10 ఎకరాల విలువైన స్థలాన్ని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు కేటాయించారన్నారు. అది కూడా గతంలో ఉన్న జీవో ప్రకారమే ఇచ్చారని గుర్తు చేశారు.
జీవోలను అనుసరించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించారని, వాటి జోలికి వస్తే జాగ్రత్త అని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులను టచ్ చేస్తే, ఊరుకోబోమని స్పష్టం చేశారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ఆంధ్రా బ్యాంకుకు ఏ విధంగా కిరాయికి ఇచ్చారో తెలపాలన్నారు.
కరీంనగర్ లోని కాంగ్రెస్ బిల్డింగ్ కిరాయికి ఇస్తున్నారని, ఖమ్మంలోని ఆఫీస్ ను కమర్షియల్ గా వాడుకుంటున్నారన్నారు. ఇకనైనా హనుమకొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చే కుట్రను మానుకోవాలని, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఆత్మ విమర్శ చేసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ జిల్లా కార్యాలయాలకు స్థలాలను కేటాయించిందని, అన్ని పార్టీలకు ఏ విధంగా స్థలాలను ఇచ్చిందో అదే తీరుగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
బాలసముద్రంలోని సర్వే నెంబర్ 1066 లో ఒక ఎకరం భూమిని బీఆర్ఎస్ పార్టీ 4 లక్షల 84 వేలకు కొనుగోలు చేసి, పార్టీ కార్యక్రమాల కోసం వాడుతోందని చెప్పారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమిని క్యాన్సిల్ చేయాలని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారని, వారు పంపిన నోటీసులకు సమాధానం కూడా ఇచ్చామని తెలిపారు.
అన్ని పార్టీల కార్యాలయాలకు ప్రభుత్వమే భూములను కేటాయిస్తుందని, అలాగే హనుమకొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.
2009 నుండి 2023 వరకు ఎమ్మెల్యేగా పని చేశానని, 15 ఏళ్ల పదవీకాలంలో వేరే పార్టీ నాయకులపై ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరున ప్రతీకార పాలన సాగిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ జోలికిగానీ, ఆఫీస్ జోలికిగానీ వస్తే ప్రజలే అడ్డుకుంటారని అన్నారు. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెల మేడిగడ్డ కుంగిపోయిందని, మరొక నెల విద్యుత్ అవినీతి అని, ఇంకో నెల టెలిఫోన్ టాపింగ్ అంటూ కాలయాపన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
ప్రతీకారాలు మానేసి ప్రజా సమస్యలపై కొట్లాడాలని వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, కార్పొరేటర్లు చెన్నం మధు, బోయిన్ పల్లి రంజిత్ రావు, నల్ల స్వరూపారాణి, ఇమ్మడి లోహిత రాజు తదితరులు పాల్గొన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)