Vikarabad case : జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ.. సంచలన విషయాలు వెల్లడి-patnam narender reddy letter released from jail regarding attack case on vikarabad district officials ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vikarabad Case : జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ.. సంచలన విషయాలు వెల్లడి

Vikarabad case : జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ.. సంచలన విషయాలు వెల్లడి

Basani Shiva Kumar HT Telugu
Nov 14, 2024 05:31 PM IST

Vikarabad case : వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా.. జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో కీలక విషయాలు వెల్లడించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏముందో తెలియదని.. పట్నం నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.

వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి
వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ విడుదల చేశారు. జైలు నుండి అఫిడవిట్ ఇచ్చిన నరేందర్ రెడ్డి.. పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని స్పష్టం చేశారు. కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టుకు వచ్చాక అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని.. అప్పటివరకు అందులో ఏముందో తనకు తెలియదన్నారు.

అటు లగిచర్ల రైతులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చారు. లగిచెర్ల రైతులను ఢిల్లీ తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. లగిచెర్ల రైతులను జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఇటు క‌లెక్ట‌ర్‌పై దాడి ఘ‌ట‌న‌లో నిందితుల‌ను క‌లిశారు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి. కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్ట్ అయిన వారికి బీఆర్ఎస్ పార్టీ అండ‌గా ఉంటుందని భరోసా ఇచ్చారు. అరెస్ట్ అయిన వారిని పరిగి సబ్ జైలులో పరామర్శించానని.. గతంలో దాడులు జరిగాయని తెలిసి కూడా కలెక్టర్ ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా గ్రామంలోకి వెళ్లారని సబితా వ్యాఖ్యానించారు. పట్నం నరేందర్ రెడ్డిని రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.

అటు.. రైతులు ఎవ్వరూ భూములు ఇవ్వడానికి రెడీగా లేరని.. లగిచర్ల గ్రామస్థులు చెబుతున్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడారు. భూములు ఇవ్వాలని అడగలేదన్నారు. తాము ఎందుకు భూములు ఇస్తామని రైతులు ప్రశ్నిస్తున్నారు. మీరు సచ్చినా సరే ఫార్మా కంపెనీ వస్తుందని తమను బెదిరించారని వాపోయారు. భూములు పోతాయి, ఇండ్లు పోతాయని మమ్మల్ని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కలెక్టర్ వస్తున్న విషయం కూడా తెలియదన్నారు. తాము ఎవరి మీద దాడి చేయలేదని చెబుతున్నారు.

ఈ కేసుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. 'రైతుల‌ను న‌ష్ట‌పెట్టాల‌న్నది ఈ ప్ర‌భుత్వ ఉద్దేశం కాదు. వారి స‌మ‌స్య‌ల‌ను విన‌డానికి, ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. రైతుల ముసుగులో అధికారుల‌ను చంపే ప్ర‌య‌త్నం చేయ‌డం మంచిప‌ద్ద‌తి కాదు. ల‌గ‌చ‌ర్ల సంఘ‌ట‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంటుంది' అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

'ఈ రోజు అధికారుల‌పై దాడి జ‌రిగిన‌ట్లుగానే.. రేపు రాజ‌కీయ నాయ‌కుల‌కో, ప్ర‌జ‌ల‌కో జ‌రిగితే ప్ర‌భుత్వం ఉపేక్షించ‌దు. జిల్లాకు మెజిస్ట్రేట్‌గా ఉన్న‌క‌లెక్ట‌ర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర ప‌న్నారు. అధికారుల మీద దాడి అనేది మ‌న‌మీద మ‌నం దాడి చేసుకున్న‌ట్లే. రైతుల ముసుగులో కొంత‌మంది గులాబీ గూండాలు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు' అని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

'కుట్ర‌పూరితంగా అధికారుల‌ను రైతుల‌కు దూరం చేసే ప్ర‌య‌త్నం కొంత‌మంది చేస్తున్నారు. గులాబీ గూండాల కుట్ర‌ల‌ను రైతాంగం అర్ధం చేసుకోవాలి. ప్ర‌జ‌ల‌ను కాపాడుకున్న‌ట్లే, అధికారుల‌ను కాపాడుకోలేక‌పోతే ప‌ని చేయ‌డానికి ఏ అధికారి ముందుకు వ‌స్తారు? బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారం వెల‌గ‌బెట్టిన‌నాడు ఇదే ప‌ద్ద‌తి చేశారా? ఏం త‌ప్పుచేశార‌ని ఆనాడు ఖ‌మ్మంలో మిర్చి రైతుల‌కు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారు' అని పొంగులేటి ప్రశ్నించారు.

'మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌లో రైతుల‌ను దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రించారు. పిల్లా, పాపా, ముస‌లి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగ‌తి మ‌రిచారా? ఎగిసి ఎగిసి ప‌డుతున్న కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో ద‌ళితుల‌కు బేడీలు వేసిన సంగ‌తి మ‌రిచిపోయారా? ల‌గ‌చ‌ర్ల‌లో ఆ ప‌రిస్ధితి లేదు క‌దా?' అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.

Whats_app_banner