ములుగు జిల్లా మేడారం టెరిటోరియల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ రేంజ్‌ల పరిధి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో.. పులి సంచరిస్తోందని ఏటూరునాగారం రేంజ్ అధికారులు చెబుతున్నారు. మేడారం, మహదేవపూర్ సరిహద్దు అడవిలో పులి ఒక గేదెను చంపినట్లుగా ఆనవాళ్లు లభ్యమయ్యాయని అంటున్నారు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏటూరునాగారం ఎఫ్‌డీవో ఆదేశాల మేరకు.. పులి సంచారం, అడుగు జాడలు తెలుసుకునేందుకు.. తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట, కాల్వపల్లి, నార్లాపూర్, కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, ఏటూరునాగారం మండలం కొండాయి అడవుల్లో పర్యటించినట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావొద్దని సూచించారు.
ఏటూరునాగారం అడవులు.. పెద్ద సంఖ్యలో చిరుతపులులు, అడవి పందులు, దుప్పులు, కొండగొర్రెలు వంటి పులుల ఆహారానికి అనువైన జంతువులకు ఆవాసంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని దట్టమైన అడవులు, గుట్టలు, వాగులు పులులు నివసించడానికి, వేటాడటానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. ఈ అటవీ ప్రాంతంలో మానవుల సంచారం తక్కువగా ఉంటుంది. దీంతో వల్ల పులులు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.. మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌కు అనుసంధానంగా ఉంది. దీంతో పులుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వరంగల్ జిల్లాలోని పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కూడా పులులు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా ఆహారం, ఆవాసం అందుబాటులో ఉండటం దీనికి కారణం.
గత కొన్నేళ్లుగా పులులు తమ ఆవాసాల కోసం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్నాయి. ఈ క్రమంలో మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఆహారం కోసం వెతుకులాట, కొత్త ఆవాసాల అన్వేషణే దీనికి ప్రధాన కారణంగా అధికారులు వివరిస్తున్నారు. మొత్తానికి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులుల సంచారానికి ఏటూరునాగారం ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంది.
తెలంగాణలో పులుల సంఖ్య పెరుగుతున్న దశలో ఉంది. అటవీ శాఖ అధికారులు వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు పులులు తమ ఆవాస ప్రాంతాల నుండి కొత్త ప్రాంతాల కోసం వెతుకుతూ.. ఇతర అడవుల్లోకి వస్తుంటాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని అడవుల నుండి పులులు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు వలస వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు.