పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా రామయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా… తుది శ్వాస విడిచారు.
ఇయ అసలు దరిపల్లి రామయ్య. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించారు. ప్రకృతి ప్రేమికుడైన ఆయన… కోటిపైగా మొక్కలు నాటారు. దీంతో ఆయన పేరు వనజీవి రామయ్యగా మారిపోయింది. ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం…. 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
రామయ్యతో పాటు ఆయన భార్య జానమ్మ కూడా ఆయనకు తోడ్పాటునిచ్చేది. ఐదు దశాబ్దాలకు పైగా సామాజిక అడవుల పెంపకం కోసం నిరంతరం పని చేస్తూ వచ్చారు. మానవ శ్రేయస్సుకు విత్తనమే పరిష్కారం అని రామయ్య బలంగా నమ్మేవాడు. ప్రకృతి పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆకాంక్షించేవారు. ప్రకృతిని రక్షించండంటూ ఎన్నో వేదికల నుంచి పిలపునిచ్చారు.
కోటిపైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించిన రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి రెడ్డిపల్లిలోని ఆయన ఇంటికి తరలివెళ్తున్నారు.
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు." ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేశారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.