Akshara Chitfunds: అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ కు ఆస్తుల్ని అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు-orders attaching properties of akshara chit funds akshara township ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Akshara Chitfunds: అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ కు ఆస్తుల్ని అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు

Akshara Chitfunds: అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ కు ఆస్తుల్ని అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు

HT Telugu Desk HT Telugu
Published Feb 14, 2025 06:22 AM IST

Akshara Chitfunds: అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ కు చెందిన రూ.14.27 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్‌ చిట్‌ఫండ్స్‌ పేరుతో డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఘటనలో జనం భారీగా నష్టపోయారు.

అక్షర చిట్‌ఫండ్స్‌ ఆస్తుల్ని జప్తు చేసిన ప్రభుత్వం
అక్షర చిట్‌ఫండ్స్‌ ఆస్తుల్ని జప్తు చేసిన ప్రభుత్వం

Akshara Chitfunds:  ప్రైవేటు చిట్ ఫండ్ ల పేరుతో డిపాజిట్లు, చిట్టీల ద్వారా భారీగా డబ్బులు సేకరించి గడువు ముగిసిన సభ్యులకు డబ్బులు చెల్లించక పోవడంతో ఆస్థులు కూడబెట్టుకుని మోసం చేసిన ప్రైవేట్ ఫైనాన్స్ చిట్ ఫండ్ కంపెనీలపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝుళిపించారు. కరీంనగర్ రాజీవ్ చౌక్ లో "అక్షర చిట్ ఫండ్స్ ప్రయివేట్ లిమిటెడ్”, “ అక్షర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్" కు చెందిన ఆస్తులను క్రయవిక్రయాలు చేయకుండా అటాచ్డ్ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ డిపాజిటర్ల రక్షణ చట్టం, 1999 (చట్టం నం. 19 ఆఫ్ 1999) సెక్షన్ 5 కింద, అక్షర టౌన్‌ షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్" ద్వారా సంపాదించిన స్థిరాస్తుల అటాచ్‌మెంట్ చేయాలని గతంలో డీజీపీ సీఐడీ హైదరాబాద్ ద్వారా ప్రభుతాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మోహంతి కోరారు. 

కేసుల వివరాలను పరిశీలించిన అనంతరం బాధితులకు న్యాయం చేయడానికి "అక్షర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్"కు డిపాజిటర్స్ చెల్లించిన డబ్బుల ద్వారా అక్రమంగా సంపాదించిన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామ పరిధిలోని 11 కోట్ల 50 లక్షల విలువ చేసే 50 ఎకరాల భూములు, రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలోని 2 కోట్ల 70 లక్షల 66 వేల 600 రూపాయల విలువ చేసే సర్వే నెంబర్ 129/A , 130/Aలోని 24,606 చదరపు గజాల స్థిరాస్తులు మొత్తంగా రూ.14కోట్ల 27లక్షల 66 వేల 689 రూపాయల ఆస్తులను అటాచ్‌మెంట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ జారీ చేసింది.

గతంలోనే సంస్థ ప్రతినిధుల అరెస్టు....

బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్ షిప్ ప్రయివేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన ప్రధాన నిందితుడు హన్మకొండకు కు చెందిన పేరాల శ్రీనివాస రావు, A2. పేరాల శ్రీ విద్య, A3.సూరనేని కొండలరావు, A4. పుప్పాల రాజేందర్. A5. అలువుల వరప్రసాద్, A6. గొనె రమేష్ లపై గత ఏడాది ఫిబ్రవరిలో కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. 

అధిక వడ్డీ ఆశ చూపుతూ అనేక మంది ఉద్యోగస్తులను , విశ్రాంత ఉద్యోగులను మోసం చేసినట్లు గుర్తించారు. డిపాజిట్ దారుల నుంచి సేకరించిన సొమ్ముతో పలు చోట్ల భూములను కొనుగోలు చేసి సొంత ఆస్తులను కూడ బెట్టుకున్నారు. తిరిగి డబ్బులు చెల్లించాలని కోరిన బాధితులకు తిరిగి డబ్బు ఇవ్వకపోగా సంస్థలను అర్దాంతరంగా మూసివేసి చీటింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

సీపీ అభిషేక్ మొహంతి ఏర్పాటు చేసిన ఎకానమికల్ అఫెన్సివ్ వింగ్ కు పెద్ద ఎత్తున బాధితుల ఫిర్యాదులు చేయడంతో విచారణ జరిపి అక్షర గ్రూపు సంస్థల ఆరుగురు ప్రతినిధులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అక్షర చిట్ ఫండ్స్ ప్రయివేట్ లిమిటెడ్ మరియు అక్షర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్" ద్వారా సంపాదించిన స్థిరాస్తుల్ని  అటాచ్‌మెంట్ చేశారు. 

ఆస్తుల్ని  అటాచ్‌ చేయాలని  డీజీపీ, సీఐడీ, హైదరాబాద్ ద్వారా ప్రభుతాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి కోరారు. సిపి అభ్యర్ధన మేరకు మొత్తంగా 14కోట్ల 27లక్షల 66 వేల 689 రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner