Telangana Heatwave : తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-orange alert for 15 districts in telangana as heatwave intensity increases ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Heatwave : తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Heatwave : తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Telangana Heatwave : మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్తే మాడు పగిలిపోతోంది. మరోవైపు వడగాలులు భయపెడుతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ (unsplash)

తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది.

హైదరాబాద్‌లో ఇలా..

ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఇవాళ్టి (మార్చి 28) నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే మూడు నెలల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాబోయే రెండు నెలల్లో..

ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక వేడి ఉంటుందని చెబుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. 1901-2025 మధ్య సగటు ఉష్ణోగ్రతలు తీసుకుంటే.. ఈ ఏడాదే తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మార్చి 1 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలాఖరు నాటికి 42 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్టోగ్రతలు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

జాగ్రత్తలు..

వేసవిలో చెమట రూపంలో శరీరం నుంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. కాటన్ వంటి తేలికపాటి, వదులైన దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు.

పండ్ల రసాలు అవసరం..

ఎండలో తిరగాల్సి వస్తే తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ వంటి పండ్ల రసాలు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంది. కాబట్టి తాజా ఆహారం మాత్రమే తీసుకోవాలి. కళ్లను తరచుగా చల్లటి నీటితో కడుక్కోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కళ్లజోడు ధరించాలని వైద్యులు చెబుతున్నారు.

ఎండలో తిరగొద్దు..

చర్మాన్ని ఎండ నుంచి రక్షించుకోవడానికి చల్లటి నీటితో స్నానం చేయాలి. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో తిరగడం తగ్గించాలి. నీరు ఎక్కువగా తాగాలి. ఫ్రిజ్ లోని నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. కావున మట్టి కుండలోని నీటిని తాగడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి రోజూ స్నానం చేయడం మంచిదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

 

Basani Shiva Kumar

eMail