TG Govt LRS : ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై బిగ్ అప్డేట్ - డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసే ఛాన్స్, అప్లికేషన్ స్టేటస్ ఇలా చూడొచ్చు
TG Govt Layout Regularization Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకునే సమయంలో ధ్రువపత్రాలను సమర్పించని వారికి అవకాశం కల్పించింది. ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేసేందుకు ఓ లాగిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
TG Govt Layout Regularization Scheme: ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. 2020లో తీసుకొచ్చిన ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రక్రియపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా… గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది.
2020 నుంచి ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ విషయంలో పెద్దగా ముందుకు వెళ్లిన పరిస్థితి లేదు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో... దరఖాస్తుదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది.
దరఖాస్తు చేసుకునే సమయంలో ధ్రువపత్రాలను సమర్పించని వారికి అవకాశం కల్పించింది. ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేసేందుకు ఓ లాగిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్లికేషన్ సమయంలో సమర్పించని డాక్యుమెంట్లను ఇందులో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. https://lrs.telangana.gov.in/layouts/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకునే అవకాశం కల్పించింది.
ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత… అధికారులకు, దరఖాస్తుదారులకు వేర్వేరుగా లాగిన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్లికేషన్ చేసుకున్నవారు lrs.telangana.gov.in ద్వారా సిటిజన్ లాగిన్‌లోకి వెళ్లాలి. ఇక్కడ దరఖాస్తు చేసుకున్న సమయంలో ఎంట్రీ చేసిన ఫోన్ నెంబర్ ను నమోదు చేయాలి. ఆ వెంటనే మీకు ఓటీపీ వస్తుంది. వెరిఫైడ్ ఓటీపీపై క్లిక్ చేయగానే…. హోంపేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ అప్లికేషన్స్ అప్ లోడ్ ఆప్షన్ పై నొక్కి…. మీ ప్లాట్ కు సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ విలువ నిర్ధారిత పత్రం, లేఅవుట్ కాపీ తదితర పత్రాలను అప్ లోడ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ 5 ఎంబీలోపే ఉండాలి. ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయటం ద్వారా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా… ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది.
స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి….
- ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు స్టేటస్ కూడా చెసుకోవచ్చు.
- https://lrs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- సిటిజన్ లాగిన్ పై నొక్కి మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.
- లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో కనిపించే అప్లికేషన్ స్టేషన్ ఆప్షన్ పై నొక్కాలి.
- ఇక్కడ కనిపించే వ్యూ ఆప్షన్ పై నొక్కితే మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.
లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్)పై ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు ఇచ్చారు. 3 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.
2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అక్రమాలకు తావులేకుండా, నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని అన్నారు.