మిస్ వరల్డ్ 2025 పోటీలు - విజేతగా థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత-opal suchatha from thailand is the winner of miss world events 2025 held in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మిస్ వరల్డ్ 2025 పోటీలు - విజేతగా థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత

మిస్ వరల్డ్ 2025 పోటీలు - విజేతగా థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత

హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్ట్ - 2025 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో థాయ్ లాండ్ కు చెందిన సుందరీమణి ఓపల్ సుచాత సువాంగ్ విజేతగా నిలిచింది. ఆమెకు వజ్రాల కిరీటంతో పాటు రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.

విజేతగా ఓపల్ సుచాత

హైదరాబాద్‌ లో మిస్ వరల్డ్ - 2025 పోటీలు వైభవంగా జరిగాయి. హైటెక్స్‌ వేదికగా ఇవాళ సాయంత్రం 06. 30 గంటలకు ఫైనల్ పొటీలను నిర్వహించారు. ఖండాల వారీగా షార్ట్ లిస్ట్ చేశారు. ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత… 72వ మిస్ వరల్ట్ పోటీల(2025 సంవత్సరం) విజేతగా థాయ్ లాండ్ కు చెందిన సుందరీమణి ఓపల్ సుచాత సువాంగ్ ను ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా విజేతగా నిలిచిన ఓపల్ సుచాత కిరీటాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ పోటీల్లో రెండవ స్థానంలో ఇథియోపియా, మూడో ప్లేస్‌లో పోలాండ్, నాలుగవ స్థానంలో మార్టినిక్ సుందరీమణులు నిలిచారు.

ప్రైజ్ మనీ వివరాలు:

తెలంగాణ ప్రభుత్వ సాకారంతో హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు సుమారు 108కి పైగా దేశాల నుంచి సుందరీమణులు తరలివచ్చారు. వీరిలో థాయిలాండ్ కు చెందిన సుందరీమణి విజేతగా నిలిచింది. దీంతో ఆమె 72వ మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు.

మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన ఓపల్ సుచాతకు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 8.5 కోట్ల రూపాయలు. ఈ ప్రైజ్ మనీని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తో పాటు ప్రధాన స్పాన్సర్ల ద్వారా లభిస్తుంది. అంతేకాకుండా వజ్రాలతో చేసిన కిరీటాన్ని స్వీకరించారు. మిస్‌ వరల్డ్‌ 2024ను క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఓపల్ సుచాత నేపథ్యం:

ఓపల్ సుచాత సువాంగ్ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో(2003) జన్మించారు. ఈమె గతంలో మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024 కిరీటాన్ని గెలుచుకున్నారు. అంతేకాకుండా మిస్ యూనివర్స్ 2024 పోటీలో థాయిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లో మూడవ ప్లేస్ లో నిలిచారు. తాజాగా జరిగిన మిస్ వరల్ట్ 2025 పోటీల్లో గెలిచి… ప్రపంచ సుందరీగా నిలిచారు.

ప్రస్తుతం ఈమె థమ్మసాట్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రోగ్రామ్ లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.