Sri Rama Navami :ఆన్‌లైన్‌లో భద్రాచలం రాములోరి కళ్యాణం-online tickets sale for sri rama navami celebrations in bhadracahalm temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Online Tickets Sale For Sri Rama Navami Celebrations In Bhadracahalm Temple

Sri Rama Navami :ఆన్‌లైన్‌లో భద్రాచలం రాములోరి కళ్యాణం

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 06:03 AM IST

Sri Rama Navami శ్రీరామ నవమి సందర్బంగా భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవాలను ఆన్‌లైన్‌లో వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఆన్‌లైన్‌ టిక్కెట్లను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.

Ram temple in Bhadrachalam: భద్రాచలం టెంపుల్
Ram temple in Bhadrachalam: భద్రాచలం టెంపుల్

Sri Rama Navami భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో సైతం భక్తులు కళ్యాణోత్సవాలను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మార్చి 30న ఆలయ సమీపంలోని దేవస్థానం మిథిలా మండపంలో నిర్వహించే కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లను మార్చి1 బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు రామాలయం ఈవో రమాదేవి తెలిపారు.

www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు ఉంటాయని ఈవో వివరించారు. రూ.7,500 టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పించి స్వామివారి ప్రసాదం అందజేస్తారు.

మిగతా వాటిలో ఒక టికెట్‌పై ఒకరికే అవకాశం కల్పిస్తారు. మొత్తంగా 16,860 మంది టికెట్లతో మండపంలోను, 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రూ.7,500 టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆలయ కార్యాలయంలోనూ బుధవారం నుంచి విక్రయించనున్నారు.

మార్చి 31న నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించి ఈసారి 3 రకాల ధరలతో టికెట్లను విక్రయించనున్నారు. వీటినీ బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

భద్రాచల క్షేత్ర వైభవం….

భారతావనిలో పౌరాణికంగా, చారిత్రకంగాను అతి ప్రసిద్ధమైన దివ్య క్షేత్రం భద్రాచల శ్రీరామ క్షేత్రం ఒకటి. త్రేతాయుగమున దండకారణ్యములోని పర్ణశాల ప్రాంతములో వనవాసము చేయుచున్న సీతారాములకు ఒకనాటి విహార సమయమున విశ్రాంతి స్థానమైన ఒక శిల ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి వారి అనుగ్రహానికి పాత్రమైందని చెబుతారు. ఆ శిలనే బ్రహ్మదేవుని వరప్రసాదముగా మేరుదేవి మేరు పర్వతరాజ దంపతులకు భద్రుడు అను పేరిట పుత్రుడై జన్మించినట్లు పురాణాల్లో వివరించారు.

బాల్యం నుండి శ్రీరామభక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రమును ఉపదేశంగా పొంది, శ్రీరామ సాక్షాత్కారమునకై దండకారణ్యములో ఘోర తపస్సు నాచరించాడు. ఆ తపఃప్రభావముతో శ్రీమన్నారాయణుడు మరల శ్రీరామ రూపమును దాల్చి చతుర్భుజ రామునిగా శంఖ చక్ర ధనుర్భాణములను ధరించి, వామాంకమున (ఎడమ తొడపై) సీతతో, వామ పార్శ్వమున (ఎడమప్రక్కన) లక్ష్మణునితో కూడి పద్మాసనమున ఆసీనుడై ప్రత్యక్షమయ్యారని పురాణాల్లో పేర్కొన్నారు.

ఆ తర్వాత భద్రమహర్షి కోరికపై పర్వతరూపంగా మారిన అతని శిఖరాగ్రముపై శ్రీ పాదముద్రలనుంచి పవిత్ర గోదావరి నదికి అభిముఖముగా ఆ భద్రుని హృదయ స్థానమున వెలిశాయని, భద్రుడు అచలమై (కొండ) నందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చిందంటారు. స్వామికి భద్రాద్రిరాముడు అని, వైకుంఠము నుండి సాక్షాత్తుగా అవతరించుట చేత వైకుంఠరాముడు అని, ఇక్కడి సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు అ కార ఉ కార మ కార స్వరూపములు అయినందున ఓంకారరాముడు అని, శంఖ చక్ర ధనుర్భాణములు ధరించుటచే రామనారాయణుడు అని కూడా పేర్లు కూడా ఉన్నాయి.

IPL_Entry_Point