Madhapur Car Accident : మాదాపూర్లో కారు బీభత్సం... ఒకరి దుర్మరణం
Hyderabad Latest News : హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Madhapur Car Accident : హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వైపు వేగంగా వెళుతున్న కారు మాదాపూర్ వద్దకు రాగానే ఒక్కసారే అదుపు తప్పింది.అనంతరం రోడ్డు పక్కనే ఉన్న ఓ పాల వ్యాపారి మీదకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.....మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు..ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు
లంగర్ హౌస్ లో శుక్రవారం అర్థరాత్రి ఓ కారు హల్ చల్ చేసింది. అతి వేగంగా వచ్చి అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ రవి తెలిపిన వివరాల ప్రకారం...... బండ్లగూడ జాగిర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ రోహిత్ ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో విధులు నిర్వర్తిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం అతను ఆస్పత్రి నుంచి విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా......లంగర్ హౌస్ సంగం వద్దకు రాగానే ఒక్కసారిగా కారు బ్రేక్ వేయబోయి రేస్ పై తొక్కాడు. దీంతో కారు అదుపు తప్పి నేరుగా ఫుట్ పాత్ పై ఉన్న పండ్ల దుకాణాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పండ్ల వ్యాపారి సోహెల్ కు తీవ్రంగా గాయాలు కాగా…రోహిత్,తరుణ్ కు స్వల్ప గాయాలు ఆయాయి.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కారు,ఆటో ఢీకొని......వ్యక్తి దుర్మరణం
ఓ ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు మండలం రాజంపేట గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజంపేట గ్రామానికి చెందిన ఊడల నరేష్ (43) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.నిత్యం కూలీలను రైల్వే స్టేషన్ లో దింపే వాడు.ఈ క్రమంలోనే శుక్రవారం కూడా కూలీలను దింపి ఇంటికి వెళుతుండగా....రాజంపేట సమీపంలో వేగంగా వచ్చిన ఓ కారు ఆటోని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో డ్రైవర్ నరేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా......చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.