Medak Crime : కూలీ డబ్బుల విషయంలో గొడవ.. కర్రతో మేస్త్రిని కొట్టి చంపిన కూలి!
Medak Crime : మెదక్‌లో దారుణ హత్య జరిగింది. కూలీ డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో కూలి కోపంతో కర్రతో మేస్త్రి తలపై బలంగా కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో మేస్త్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా కాళ్లకల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రమోద్ పాశ్వాన్ (42) తాపీమేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన నరేష్ కాళ్లకల్‌లో నూతన ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఆ ఇంటి నిర్మాణ పనులను గత ఆరు నెలలుగా ప్రమోద్ పాశ్వాన్ కూలీలతో కలిసి చేస్తున్నాడు. పాశ్వాన్ కింద హరియాణాకు చెందిన బిట్టు, అతని భార్య కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా బిట్టు నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు.
ఈ క్రమంలో మేస్త్రి పాశ్వాన్, బిట్టు ఆదివారం రాత్రి మద్యం తాగడానికి వెళ్లారు. అక్కడ మద్యం తాగాక కూలీ డబ్బుల విషయంలో మేస్త్రికి బిట్టుకి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన బిట్టు కర్రతో మేస్త్రి పాశ్వాన్ తలపై బలంగా కొట్టాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో మేస్త్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తూప్రాన్ సీఐ రంగకృష్ణ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంటి యజమాని నరేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్ధిక ఇబ్బందులతో..
ఆర్ధిక ఇబ్బందులతో మనస్థాపం చెందిన ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయపోల్‌కు చెందిన ఉష్నగళ్ల రాములు (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య పోశవ్వ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
రాములు పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి పంట వేశాడు. ఆ పంట సరిగ్గా పండకపోవడంతో అప్పులు అలాగే ఉన్నాయి. కొడుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రి ఖర్చుల కోసం మళ్లీ అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనపడక తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఆదివారం ఉదయం రాములు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)