TS Assembly Elections: స్పీడ్ పెంచిన KCR.. తెరపైకి మళ్లీ 'ముందస్తు' ముచ్చట..!-once again discusions on early elections in telangana state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Once Again Discusions On Early Elections In Telangana State

TS Assembly Elections: స్పీడ్ పెంచిన KCR.. తెరపైకి మళ్లీ 'ముందస్తు' ముచ్చట..!

Mahendra Maheshwaram HT Telugu
Nov 30, 2022 06:20 AM IST

Early Elections 2023: త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ రద్దు అవుతాయనే వార్తలు వస్తున్నాయి. ముందస్తు ప్రసక్తే లేదని చెప్పిన కేసీఆర్... రూట్ మార్చారనే చర్చ నడుస్తోంది. ఇదే విషయాన్ని కొందరు బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ముందస్తు ఎన్నికల ముచ్చట వేడిని పుట్టిస్తోంది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చ
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై చర్చ

Early Elections in Telangana: తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. ఓవైపు గులాబీ బాస్ కారు స్పీడ్ ను మరింత పెంచే పనిలో పడ్డారు. ఇదే సమయంలో బండి సంజయ్ పాదయాత్ర, ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మరోవైపు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర కొనసాగుతోంది. సరిగ్గా ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో.... ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కేసీఆర్ ముందస్తుకు వెళ్తారనే చర్చ జరిగినప్పటికీ... అలా జరగలేదు. కేసీఆర్ కూడా వెళ్లేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం సీన్ చూస్తుంటే... మరోసారి ముందస్తు ఎన్నికలపై తెగ చర్చ నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఎందుకు ఇలా...?

మొన్నటి వరకు పరిస్థితి ఒకలా ఉంటే... మునుగోడు ఫలితం తర్వాత వేగంగా మారిపోతున్నాయి. పార్టీ పరంగానే కాదు... పాలన పరంగా కేసీఆర్ దూకుడు పెంచే పనిలో పడ్డారు. డిసెంబర్ లో పలు జిల్లాల పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇదే సమయంలో యదాద్రి పవర్ ప్లాంట్ పర్యటన, మెట్రో విస్తరణ, సచివాలయం ఓపెనింగ్... డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై కసరత్తు, సొంత స్థలాలు ఉన్న వారికి ఆర్థిక సాయం ఇలా కీలక పథకాలను పట్టాలు ఎక్కించబోతున్నారు. నోటిఫికేషన్లు ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయి. ఇక డిసెంబర్ లో భారీగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు కూడా పదును పెడుతున్నారు కేసీఆర్. ఈ స్పీడ్ ను చూస్తుంటే కేసీఆర్ పక్కాగా ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని...అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే కేవలం టీఆర్ఎస్ స్పీడ్ మాత్రమే కాకుండా.... బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ కూడా ఆసక్తిని రేపుతున్నాయి. కేసీఆర్ వెళ్లను అంటే ఖచ్చితంగా వెళతారని... ఆ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారంటూ కొందరు నేతలు అంటున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి, ఇంద్రాసేనా రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ మధ్య టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడెనిమిది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయంటూ చెప్పారు. కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇక ఇదే అంశంపై తాజాగా మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ… అలాంటి ఆలోచన లేదని చెప్పారు. బీజేపీ నేతలు జ్యోతిషుల్లా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

తాజా పరిణామాలు నిజంగానే ముందస్తు వైపు తీసుకెళ్తాయా..? డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాలు చివరివి అవుతాయా..? అన్న చర్చ కూడా సీరియస్ గానే నడుస్తోంది. మరి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని క్లియర్ కట్ గా చెప్పిన కేసీఆర్... మరోసారి వ్యూహం మార్చినట్లేనా అన్నది భవిష్యత్తు పరిణామాలతో తేలిపోనుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు కార్యాచరణను రూపొందించుకుంటున్నాయి.

IPL_Entry_Point