Vemulawada Jatara: వేములవాడలో ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర...ఏర్పాట్లపై సమీక్షించిన అధికారులు
Vemulawada Jatara: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ మహాశివరాత్రికి సిద్ధమవుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు మహాశివరాత్రి జాతర నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు ఎంత మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
Vemulawada Jatara: వేములవాడ మహాశివరాత్రి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఫిబ్రవరి చివరి వారంలో 25 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ ఇప్పటినుంచే సిద్ధమవుతుంది. మహాశివరాత్రి ఏర్పాట్లపై రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆది శ్రీనివాస్ ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
జాతర సమయంలో అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, త్రాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, కళ్యాణ కట్ట, ధర్మ గుండం, బద్ది పోచమ్మ ఆలయం, హెల్ప్ సెంటర్ , సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈసారి 4లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం...
రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల రద్దీ ఏటేటా పెరుగుతుంది. గత మహా శివరాత్రి ఉత్సవాలకు 2 లక్షల 50 వేల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుత సంవత్సరం 4 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ స్థాయిలో మనం జాతర ఏర్పాట్లు చేయాలని ఆది శ్రీనివాస్ అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు నీడ, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. జాతర సందర్భంగా పక్కన మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి కార్మికులను డిప్యూట్ చేసుకొని జోన్ల వారీగా విభజించే పారిశుధ్య పక్కగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.
శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు, పాలు అందించేలా దేవస్థాన సంస్థ ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్యూ లైన్లలో చేరిన భక్తులకు దర్శనం కోసం అధిక సమయం పట్టే నేపథ్యంలో వారికి పాలు అందించేలా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ సూచించారు. క్యూలైన్లలో వచ్చే భక్తులకు ప్రధాన ఆలయం ఎంటర్ కాకముందే అవసరమైన మేర టాయిలెట్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
విఐపీలకు ప్రత్యేక క్యూలైన్...
మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే వి.ఐ.పి. లను ప్రత్యేక క్యూ లైన్ లో వెళ్ళేలా ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. భక్తులకు వీలైనంత తక్కువ సమయంలో రాజన్న దర్శనం జరిగేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. భక్తుల సంఖ్య దృష్ట్యా పటిష్ట భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో ఫోన్ సిగ్నల్స్ సమస్య దృష్టిలో ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో మొదలగు ఆపరేటర్లతో చర్చించి తాత్కాలిక టవర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు వేములవాడ కు గతం కంటే 30% అధికంగా బస్సు సర్వీసులు నడపాలని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటి కప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు.
జాతర ముహూర్తం...
మహాశివరాత్రి జాతర ముహుర్తాన్ని ఆలయం ప్రధాన అర్చకులు భీమ శంకర శర్మ ఖరారు చేశారు. ఫిబ్రవరి 25 న రాత్రి ఏడు గంటలకు ప్రభుత్వం, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందని తెలిపారు.
ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 12 గంటల నుంచి 2.30 గంటల వరకు పుర జనులకు సర్వదర్శనం, తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 3.30 గంటల వరకు ప్రజా ప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శనం, ఉదయం 3.30 నుంచి 3.40 గంటల వరకు మంగళ వాయిద్యంలో ప్రదర్శన, ఉదయం 3.40 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాతం సేవ మరియు ఆలయ శుద్ధి, ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు ప్రాతకాల పూజ/అనువంశిక అర్చకుల దర్శనం ఉంటుందని తెలిపారు.
మహాశివరాత్రి ఫిబ్రవరి 26న సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివదీక్ష స్వాముల దర్శనం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహా లింగార్చన (స్వామివారి కల్యాణ మండపంలో) అనువంశిక బ్రాహ్మణోత్తముల దర్శనం , రాత్రి 11.35 నిమిషాలకు లింగోద్భావ కాలం నందు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహించడం జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)