Hanamkonda IIIT : హన్మకొండ జిల్లాలో కొత్త ట్రిపుల్‌ ఐటీ.. స్థలాన్ని పరిశీలించిన అధికారులు-officials inspect the site for the construction of a new iiit in hanumakonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hanamkonda Iiit : హన్మకొండ జిల్లాలో కొత్త ట్రిపుల్‌ ఐటీ.. స్థలాన్ని పరిశీలించిన అధికారులు

Hanamkonda IIIT : హన్మకొండ జిల్లాలో కొత్త ట్రిపుల్‌ ఐటీ.. స్థలాన్ని పరిశీలించిన అధికారులు

Hanamkonda IIIT : తెలంగాణ విద్యార్థులకు సాంకేతిక విద్యను మరింత చేరువ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే.. మరో ట్రిపుల్ ఐటీని నిర్మించాలని సంకల్పించింది. దీంతో అధికారులు హన్మకొండ జిల్లాలో స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఆర్జీయూకేటీ

బాసరలో ఇప్పటికే ట్రిపుల్ ఐటీ ఉంది. దీనికి అనుబంధంగా తెలంగాణలో మరో రెండు కొత్త క్యాంపస్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంట్లో ఒక దాన్ని హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా నిపుణుల కమిటీ సభ్యులు బాసర ఆర్‌జీయూకేటీ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గోవర్ధన్, జేఎన్‌టీయూహెచ్‌ మాజీ రిజిస్ట్రార్‌ ఆచార్య మంజూర్‌ హుస్సేన్‌ ఇటీవల రెవెన్యూ అధికారులతో కలిసి.. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలోని 60 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.

మరో 40 ఎకరాలు అవసరం..

కమిటీ సభ్యులు పరిశీలించిన ఆ స్థలం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కానీ.. భవిష్యత్తు అవసరాలకు మరో 40 ఎకరాలు అవసరమని కమిటీ సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 4 కొత్త ట్రిపుల్‌ ఐటీలను నెలకొల్పుతామని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. ఈ క్రమంలోనే గత సెప్టెంబరులో జరిగిన విద్యా సంస్కరణల మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో రెండు ప్రాంగణాల ఏర్పాటుపై చర్చ జరిగింది.

తెరపైకి హన్మకొండ..

వీటిల్లో ఒకటి ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని మొదట భావించారు. కానీ తాజాగా హన్మకొండ జిల్లాలో నెలకొల్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ఏటా 1500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో 9 వేల మందికి పైగా విద్యార్థులతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. అక్కడ కేవలం బీటెక్‌... అదీ సంప్రదాయ ఇంజినీరింగ్‌ కోర్సులు మాత్రమే ఉన్నాయి.

కొత్త కోర్సులతో..

అయితే.. కొత్త ఏర్పాటు చేయబోయే వాటిల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా బీటెక్‌ బయోటెక్నాలజీ, బయో మెడికల్, బయో ఇన్‌ఫర్‌మేటిక్స్, ఫార్మా టెక్నాలజీ లాంటి ఇంజినీరింగ్, బయో సైన్స్‌ రెండింటి సమ్మేళనంతో మల్టీ డిసిప్లెనరీ కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. దీంతో మరో రెండు క్యాంపస్‌లను ప్రారంభించాలని కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలను అందజేసింది.

ఒక్కోదానికి రూ.500 కోట్లు..

కొత్తగా నిర్మించబోయే ఒక్కో ప్రాంగణానికి కనీసం రూ.500 కోట్ల నిధులు కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్‌జీయూకేటీల అభివృద్ధికి కేవలం రూ.35 కోట్లు ప్రతిపాదించింది. ఈ నిధులు ఇప్పుడున్న బాసర ప్రాంగణానికే సరిపోవని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త క్యాంపస్‌లు 2025-26 విద్యా సంవత్సరంలో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ.. భవిష్యత్తులో కచ్చితంగా కొత్త క్యాంపస్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.