Warangal Development : వరంగల్ భద్రకాళి చెరువుకు గండి.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు.. 8 ప్రధాన అంశాలు
Warangal Development : దాదాపు 50 ఏళ్లుగా భద్రకాళి చెరువు పూడిక తీయలేదు. ఫలితంగా వ్యర్థాలు, గుర్రపు డెక్క, మట్టి పేరుకుపోయింది. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. తాజాగా భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టారు. అయితే.. దీనిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
వరంగల్ భద్రకాళి చెరువుకు అధికారులు గండి కొట్టారు. కాకతీయుల కాలం నాటి రాతి కట్టడం మత్తడి బండ్‌కు గండి పెట్టారు. చెరువులో పూడికతీత పనులు మొదలుపెట్టారు. మట్టి పూడికతీత, గుర్రపు డెక్కను తొలగించనున్నారు. 382 ఎకరాల విస్తీర్ణంలో భద్రకాళి చెరువు నుంచి.. 15 రోజులపాటు నీటిని దిగువ విడుదల చేయనున్నారు. రోజుకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దిగువన కాలనీలు ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టారు. ఇది స్వాగతించే విషయమే అయినా.. ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి.
1.చెరువులో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాల సంగతేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేసవిలో ఇళ్లలోని బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం పొంచి ఉందని ఇంజినీర్లు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2.భద్రకాళి చెరువు ఖాళీ చేస్తే మళ్లీ నింపడానికి ఉన్న ఒక్క మార్గం కాకతీయ కాలువ. అయిదేళ్ల కిందట వరంగల్ ఆటోనగర్ కాకతీయ కెనాల్ ఆఫ్‌టేక్ సంపును నీటిపారుదల శాఖ ఇంజినీర్లు తొలగించారు. కొత్తగా సంపు కడితేనే చెరువులోకి మళ్లీ నీటిని తీసుకొచ్చే వీలు ఉంటుంది.
3.భద్రకాళి చెరువు ప్రక్షాళన, శుద్ధీకరణ సంగతి ఎలా ఉన్నా.. కాలనీల్లో భూగర్భ జలాల సంగతి కూడా ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
4.వరంగల్- హనుమకొండ- కాజీపేట త్రి నగరాల మధ్య భద్రకాళి చెరువు ఉంది. 15 ఏళ్లుగా వర్షాకాలంలో వరద నీరు పోటెత్తడంతో చెరువు నిండుతోంది. ఈ ఏడాది కూడా భారీగా వరదలొచ్చాయి. ప్రస్తుతం భద్రకాళి చెరువులో 140- 150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు ఉంది.
5.భద్రకాళి చెరువు నీటి నిల్వతో చుట్టుపక్కల సుమారు 100 కాలనీల్లో భూగర్భ జలాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. సుమారు 5 కిలో మీటర్ల పరిధి వరకు కాలనీల్లోని బోర్లు, బావుల్లో నీళ్లు ఉంటాయి. ప్రస్తుతం చెరువులోని నీటిని ఖాళీ చేస్తే వేసవిలో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది.
5.దాదాపు పదిహేను ఏళ్ల కిందటి వరకు వేసవిలో వరంగల్ నగరప్రజల తాగునీటి అవసరాల కోసం ఆటోనగర్ కెనాల్ ఆఫ్‌టేక్ పాయింట్ నుంచి కాకతీయ కాలువ నీళ్లను భద్రకాళి చెరువులోకి పంపింగ్ చేసేవారు.
6.భద్రకాళి చెరువు నీటిని కాపువాడ మత్తడి నుంచి అలంకార్ పెద్దమోరీ, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ మీదుగా నాగారం చెరువులోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 15 నుంచి 20 రోజుల్లో చెరువు ఖాళీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
7.భద్రకాళి చెరువు నీటిని సాఫీగా విడుదల చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పి.ప్రావిణ్య వివరించారు. నాగారం చెరువు నిండిన తరువాత ఇప్పటి మాదిరే మత్తడి నుంచి కింది ప్రాంతానికి వాగు ద్వారా వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
8.భద్రకాళి చెరువు ఖాళీ చేయడం వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం తగ్గే అవకాశాలున్నాయని విశ్రాంత ఇంజనీర్లు చెబుతున్నారు. అయితే.. ఈ ఒక్క సీజన్‌లో ఇబ్బందులుంటాయని.. పనులు పూర్తయితే.. మరో 50 ఏళ్ల వరకు ఇబ్బందులు ఉండవని అంటున్నారు.