TG Indiramma Housing Scheme : లక్షల్లో దరఖాస్తులు.. వేలల్లో ఇళ్లు.. మొదటి విడతలో ఎవరికి ఇస్తారు?
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అటు ప్రభుత్వం చెప్పిన డెడ్‌లైన్ కూడా దగ్గరపడింది. అధికారులు లబ్ధిదారులను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు లక్షల్లో ఉండగా, ఇళ్లు మాత్రం వేలల్లో ఉన్నాయి. దీంతో ఎవరికి ఇస్తారనే చర్చ నడుస్తోంది.
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి దగ్గరకు సర్వేయర్లు వెళ్లి.. యాప్‌లో వివరాలు నమోదు చేశారు. ఇక లబ్ధిదారుల ఎంపిక మిగిలింది. మొదటి విడతలో సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. వివరాలు పొందుపర్చిన యాప్ ద్వారా ప్రతి దరఖాస్తును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.

వీరికి నో ఛాన్స్..
దరఖాస్తుల ఆధారంగా యాప్‌లో వివరాలు నమోదు చేశారు. సర్వేలో ఇందిరమ్మ ఇంటికి అర్హులే అయినా.. సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు, ఇతర ప్రాంతంలో ఇల్లు, కారు ఉన్నట్లు వెల్లడైతే ఆ దరఖాస్తును పక్కన పెట్టేస్తారు.
మొదటి విడతలో సొంత స్థలం ఉండి నిరుపేదలైన వారికే ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంలో ప్రభుత్వం దగ్గర ఉన్న ఇతర వివరాలతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ నెల 21 నుంచి ఏర్పాటు చేసే గ్రామసభల్లో ఈ జాబితాలను ప్రదర్శిస్తారు. ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈనెల 26వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఎక్కడెక్కడ ఎన్ని..
మొదటగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై స్పష్టత లేదు. దీనిపై అధికారులు ఫోకస్ పెట్టారు.
3,500 ఇళ్లలో గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వివరాలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి సమర్పిస్తారు. వాటికి ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం తెలుపిన తర్వాతే.. ఏ గ్రామానికి ఎన్ని.. పట్టణాల్లో ఎన్ని ఇళ్లు ఇస్తారో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఎంపికలో నిరుపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యమిస్తారని ప్రాథమికంగా తెలుస్తోంది. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే.. ఈ కమిటీల వల్ల రాజకీయ జోక్యం పెరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
కేవలం 3 జిల్లాల్లోనే..
32 జిల్లాల్లో మొత్తం 69 లక్షల 83 వేల 895 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 68 లక్షల 8 వేల 923 దరఖాస్తులను సర్వే చేసి యాప్‌లో వివరాలు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిని మినహాయిస్తే.. గురువారం వరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే 97 శాతం పూర్తయ్యింది. సిద్దిపేట, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో 100 శాతం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో 99 శాతం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 98 శాతం సర్వే పూర్తయ్యింది.