NTR Property Dispute: ఆస్తి వివాదంలో ఎన్టీఆర్, బ్యాంకు వివాదంపై హైకోర్టులో పిటిషన్‌-ntr filed petition in ts high court in property dispute ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ntr Property Dispute: ఆస్తి వివాదంలో ఎన్టీఆర్, బ్యాంకు వివాదంపై హైకోర్టులో పిటిషన్‌

NTR Property Dispute: ఆస్తి వివాదంలో ఎన్టీఆర్, బ్యాంకు వివాదంపై హైకోర్టులో పిటిషన్‌

Sarath chandra.B HT Telugu

NTR Property Dispute: సినీ నటుడు ఎన్టీఆర్‌ ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో విక్రేతలు మోసాలకు పాల్పడటంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. స్థల యజమాని ఒకే స్థలాన్ని తనఖా పెట్టి పలు బ్యాంకుల్లో రుణాలు పొందడంతో వివాదం ఏర్పడింది.

ఇంటి స్థలం వివాదంలో హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

NTR Property Dispute: సినీ నటుడు ఎన్టీఆర్ ఆస్తి వివాదంలో చిక్కుకున్నారు. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉంటున్న ప్లాట్ విషయంలో కొన్నాళ్లుగా వివాదం నెలకొంది. 2003లో గీతా లక్ష్మీ అనే మహిళ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఆ ఫ్లాట్‌పై 1996 నుండి పలు బ్యాంకులలో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. ప్రాపర్టీ మోర్ట్ గేజ్‌ ఒప్పందాల ద్వారా వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు పొందారు. గీతలక్ష్మి కుటుంబం ఉద్దేశపూర్వకంగానే బ్యాంకుల్ని బురిడీ కొట్టించారు. ఈ వివరాలు బయట పెట్టకుండా ఎన్టీఆర్‌కు స్థలాన్ని విక్రయించారు.

వేర్వేరు ప్రాంతాల్లో 4,5 బ్యాంకులలో ఒకే ఇంటి స్థలంపై ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ రుణాలు పొందారు. జూనియర్ ఎన్టీఆర్‌కు స్థలాన్ని అమ్మే సమయంలో విషయాన్ని దాచిపెట్టారు. మొత్తం ఐదు బ్యాంకుల నుంచి రుణం పొందిన గీతలక్ష్మీ 20ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌కు విక్రయించారు.

ఆస్తిని విక్రయించే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు చెప్పారు. చెన్నైలో క బ్యాంక్‌లో ఉన్న రుణాన్ని క్లియర్ చేసి ఆస్తి పత్రాలను ఎన్టీఆర్‌ స్వాధీనం చేసుకున్నారు. 2003 నుండి రోడ్‌ నంబర్ 75లో ప్లాట్ ఓనర్‌గా తారక్ కొనసాగుతున్నారు.

ఎన్టీఆర్‌ స్వాధీనం చేసుకున్న తర్వాత మిగిలిన బ్యాంకులు తనఖాలో ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చాయి. అప్పటి నుంచి ఈ వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో బ్యాంకు మేనేజర్లపై గతంలో ఎన్టీఆర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2019లో ఈ వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. తాజాగా డెబిట్ రికవరీ ట్రైబ్యునల్‌లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వెలువడింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయాల్సిందిగా సూచించిన హైకోర్టు, జూన్ 6న ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని తెలిపింది.

రోడ్‌ నంబర్‌ 75 ప్రశాసన్‌ నగర్‌లో ఉన్న ఇంటి స్థలం విలువ కోట్ల రుపాయలు ఖరీదు చేస్తోంది. ఇంటి యజమానురాలు చేసిన మోసానికి ఎన్టీఆర్‌ మూల్యం చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గీతాలక్ష్మీపై చర్యలు తీసుకోకుండా తనను వేధిస్తున్నారని, డిఆర్‌టి ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు.