NPDCL Clarification: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ఎన్పీడీసీఎల్ స్పష్టత ఇచ్చింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) పరిధిలో కరెంట్ చార్జీల పెంపు పై సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల లేదని స్పష్టం చేశారు.
టైం ఆఫ్ డే ధరలలో కూడా ఎలాంటి మార్పు లేదనీ చెప్పారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ ఛార్జీలపై తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీ ఈఆర్సీ) హనుమకొండ కలక్టరేట్ లో బహిరంగ విచారణ చేపట్టింది.
టీజీ ఈఆర్సీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన బహిరంగ విచారణ జరగగా.. సంస్థ పరిధిలోని 17 జిల్లాల నుంచి భారతీయ కిసాన్ సంఘ్ నేతలు, రైతులు, వినియోగదారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది కాలానికి విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను వినిపించారు.
2025–-26 సంవత్సరానికి టారిఫ్ పెంపుదలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. అంతేగాకుండా గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే సంబంధిత ఎల్టీ, హెచ్టీ వినియోగదారుల వర్గాలకు సాధారణ టారిఫ్ కంటే యూనిట్‌కు రూ. 0.66 గ్రీన్ టారిఫ్ విధింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
2025–-26 ఆర్థిక సంవత్సరానికి ఓపెన్ యాక్సెస్ ఎనర్జీ మేరకు సంబంధిత వినియోగదారుల వర్గానికి వర్తించే ఎనర్జీ ఛార్జీలో 10 శాతం చొప్పున స్టాండ్ బై ఛార్జీల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో చేపట్టిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో పాటు ఇతర అభివృద్ధి పనులతో కూడిన సమగ్ర సమాచారాన్ని టీజీ ఈఆర్సీ చైర్మన్ తో పాటు వినియోగదారులకు వివరించారు.
సీఎండీ వరుణ్ రెడ్డి ప్రసంగం అనంతరం బహిరంగ విచారణకు హాజరైన భారతీయ కిసాన్ సంఘ్ నేతలు, రైతులు, ఇతర వినియోగదారులు తమతమ సమస్యలను ఈఆర్సీ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్థాయిలో విద్యుత్తు శాఖ అధికారులు ఏ చిన్న పని చేయాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే వాటిని రిపేర్ షెడ్ కు తరలించే పనిని కూడా రైతుల మీదనే వేస్తున్నారని, ఖర్చును కూడా అన్నదాతలపైనే మోపుతున్నారని వాపోయారు. ఇలాంటి ట్రాన్స్ ఫార్మర్ల తరలింపు బాధ్యతను రైతులపై వేయడం వల్ల ప్రమాదానికి గురై రైతులు చనిపోయిన ఘటనలను ఉదహరించారు.
ఇక విద్యుత్తు ప్రమాదాలతో చనిపోయిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో ఆఫీసర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, సాకులు చెబుతూ తిప్పుకుంటున్నారని ఆరోపించారు. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను రోడ్డు పక్కనే ఉండేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఈఆర్సీ దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ అనుబంధంగా కొనసాగుతున్న పశు సంపదకు ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని, మీటర్లు ఇవ్వకుండా పెనాల్టీల పేరున అన్నదాతలను వేధిస్తున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో లైన్ మెన్ ల కొరత కారణంగా సేవలు సరిగా అందడం లేదని, మెరుగైన సేవలు అందించేందుకు తగిన చొరవ తీసుకోవాలని ఈఆర్సీ చైర్మన్ ను కోరారు.
అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఆబ్జెక్టర్స్ కు సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఆఫీసర్లంతా రైతు నేస్తంగా పని చేస్తున్నామని , మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను అంచనాలు రూపొందించి రోడ్ పక్కకు మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
1912 టోల్ ఫ్రీ నంబర్ అన్ని ట్రాన్స్ ఫార్మర్లపై రాయిస్తామన్నారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి, అక్కడే సమస్యలు పరిష్కారించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్ లో సిటిజన్ చార్టర్ పెడతామని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే జెఎల్ఎం, సబ్ ఇంజనీర్ , అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించి, సమస్యలు లేకుండా చూస్తామన్నారు. విద్యుత్తు ప్రమాద మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం అందేలా చొరవ చూపుతామన్నారు.
విద్యుత్తు సేవలపై వినియోగదారులకు అవగాహన కల్పించేలా గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని టీజీ ఈఆర్సీ చైర్మన్ దేవరాజు నాగార్జున్ అన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారమైతే.. ప్రత్యేక సమావేశాలకు ఆస్కారం ఉండదన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేలా సత్వర చర్యలు చేపట్టాలని, మెరుగైన సేవలు అందిస్తున్న ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం