AP TG MLC Elections: నోటిఫికేషన్ షురూ.. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు
AP TG MLC Elections: ఏపీ, తెలంగాణల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.ఏపీలో 3, తెలంగాణలో మూడు స్థానాలకు గత వారం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ స్థానాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.
AP TG Mlc Elections: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత వారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలు మార్చి 29వ తేదీతో ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది.
ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేట్ల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇళ్ల వెంకటేశ్వరరావు, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం నియోజక వర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది.
తెలంగాణలో మెదక్-నిజమాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి, మెదక్-నిజమాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ కూరా రఘోత్తమ్‌రెడ్డి, వరంగల్-ఖమ్మం - నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న జారీ చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి 10వరకు గడువు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11న, ఉపసంహరణకు ఫిబ్రవరి 13న, ఎన్నికలను ఫిబ్రవరి 27న నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగుతుంది. మార్చి 8లోగా ఎన్నికలు పూర్తి చేస్తారు.
తెలంగాణలో కొలిక్కి వచ్చిన అభ్యర్థులు…
కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై. అశోక్ కుమార్‌ను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు దశబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పని చేసిన అశోక్ కుమార్ 2024లో పదవీ విరమణ పొందారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అశోక్ కుమార్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించామన్నారు. అలాగే వరంగల్, ఖమ్మం , నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేరును టీపీటీఎఫ్ ఖరారు చేసింది.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. బిజెపి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. బీఆర్ఎస్ పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తర్జనభర్జన పడుతుంది. బీజేపి పట్టభద్రుల అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మాల్క కొమరయ్య పేర్లను ఖరారు చేసింది. ప్రచారం మొదలు పెట్టింది.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ నేతృత్వంలో జరిగిన పార్టీ ప్రాతినిధుల సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని తీర్మానించి అధిష్టానానికి పంపించారు. జీవన్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపని పరిస్థితుల్లో నరేందర్ రెడ్డి పేరును పార్టీ పెద్దలు ఖరారు చేశారు.