YSRTP Merger : కాంగ్రెస్ లో విలీనం...! వైఎస్ఆర్టీపీ నేతలకు నామినేటెడ్ పదవులు...?
YSRTP Merge in Congress : కాంగ్రెస్ లో షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం లాంఛనమే కానుంది. ఈ క్రమంలో… తెలంగాణలోని పార్టీ నేతలకు రాజకీయ భవిష్యత్ పై హామీ కాంగ్రెస్ అధినాయకత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పలువురికి నామినేటెడ్ పదవులు దక్కే ఛాన్స్ ఉంది.
YSRTP Merge in Congress :మరో రాజకీయ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతోంది. మొన్నటి తెలంగాణ శాసన సభ ఎన్నికల ముందు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) కాంగ్రెస్ లో విలీనం కానుంది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. వైఎస్సార్టీపీ తెలంగాణ రాష్ట్ర నాయకుల నుంచి అందుతున్న నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుని కాంగ్రెస్ అగ్రనాయకులతో మంతనాలు జరుపుతారు. వాస్తవానికి ఇప్పటికే పార్టీ విలీనానికి సంబంధించి లాంఛనాలు ముగిశాయని చెబుతున్నారు.
తమ అధినేత్రి ఢిల్లీ చేరుకునేలోగానే కొందరు తెలంగాణ ముఖ్య నాయకుల ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. తెలంగాణ లో రాజకీయ కార్యకలాపాలు చేపట్టాక కొన్ని పార్టీలు కాంగ్రెస్ లో విలీనం అయ్యాయి. తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు డాక్టర్ చెరుకు సుధాకర్ నాయకత్వంలోని తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడంలో విఫలమైన సినీ హీరో చిరంజీవి స్థాపిత ప్రజారాజ్యం పార్టీ సైతం కాంగ్రెస్ లో విలీనం అయ్యింది.
ఇపుడు వైఎస్సార్టీపీ వంతు
తాజాగా తెలంగాణ శాసన సభ ఎన్నికల ముందటి వరకు చురుగ్గా కార్యక్రమాలు నిర్వమించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక విధంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా అస్త్ర సన్యాసం చేసి ముందే చేతులు ఎత్తేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాము ఎన్నికల రంగం నుంచి పక్కకు తప్పుకుంటున్నామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో విలీనం చేస్తారాని, ఖమ్మం జిల్లా పాలేరు నుంచి షర్మిల పోటీకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం దీనికి ససేమిరా అనడంతో వీలీనం వాయిదా పడినట్లు తెలుస్తోంది. అసలు పార్టీ విలీనం ఉంటుందా..? లేదా అన్న అంశంపైనా నానా రకాల చర్చలు జరిగాయి. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో విజయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేకంగా రాష్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఏపీలో ఉనికిని కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా సాధించలేక పోయింది. కానీ, ఈ సారి జరగనున్న పార్లమెంటు ఎన్నికలు, ఏపీ శాసన సభ ఎన్నికల్లో చెప్పుకోదగిన ఫలితాలు సాధించే దిశలో వైఎస్ షర్మిలను పార్టీలోకి తీసుకుని, పార్టీ పగ్గాలు అప్పజెప్పి ప్రయోగం చేయాలని చూస్తోంది. దీనిలో భాగంగానే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశలో పావులు కదిపినట్టు విధితమవుతోంది.
తెలంగాణ నాయకులు కేడర్ పరిస్థితి ఏమిటి?
వైఎస్ఆర్టీపీ తెలంగాణ నాయకత్వం పరిస్థితి ఏమిటన్న ప్రశ్నను షర్మిల కాంగ్రెస్ నాయకత్వం ముందు ఉంచినట్లు సమాచారం. విలీలనం తర్వాత అటు ఏపీలో, ఇటు తెలంగాణలో అంతా కాంగ్రెస్ కేడర్, లీడర్లుగా ఉంటారని, వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్టీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు మూడు, కనీసం అయిదుకు తగ్గకుండా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు, జిల్లా స్థాయిలో మరికొన్ని నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత కమిటీల్లో పోస్టులు ఇస్తామన్న స్పష్టమైన హామీని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తమ నాయకులతో మంగళవారం లోటస్ పాండ్ లో జరిగిన సమావేశంలో నచ్చజెప్పారని తెలుస్తోంది. వైఎసార్టీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తల్లో అత్యధికులు గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వారే కావడం వల్ల గ్రామ, మండల స్థాయిల్లోనూ పెద్దగా సమస్యలు తలెత్తవన్న అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. మొత్తంగా వైఎస్సార్టీపీ తెలంగాణ కేడర్ కు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతో, ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకుని వెంట నడిచినందుకు న్యాయం చేసినట్లు కూడా అవుతుందని, ఇక వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం లాంఛనం మాత్రమేనని అభిప్రాయ పడుతున్నారు.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )
సంబంధిత కథనం