తెలంగాణ రైజింగ్.. సలహా మండలి సలహాదారుగా నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ-nobel laureate abhijit banerjee as advisor to telangana rising advisory council ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ రైజింగ్.. సలహా మండలి సలహాదారుగా నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ

తెలంగాణ రైజింగ్.. సలహా మండలి సలహాదారుగా నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ

తెలంగాణ రైజింగ్ సలహా మండలికి మరో మేథావి తోడయ్యారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఈ సలహా మండలిలో.. భాగస్వామ్యం కావడానికి నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ అంగీకరించారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థికపరమైన అంశాలపై చర్చించారు.

సీఎం రేవంత్ రెడ్డితో అభిజిత్ బెనర్జీ

రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ సలహా మండలి ఏర్పాటైంది. ఈ మండలిలో సలహాదారుగా భాగస్వామ్యం కావడానికి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అభిజిత్ బెనర్జీ అంగీకరించారు. అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇద్దరి మధ్య చర్చలు..

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వం చేపట్టిన చర్యలు వంటి అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ రంగాల నిపుణులతో తెలంగాణ రైజింగ్ సలహా మండలి ఏర్పాటు చేసింది. దీంట్లో పాలుపంచుకోవాలని ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనర్జీని ఆహ్వానించారు. సీఎం ఆహ్వానాన్ని బెనర్జీ అంగీకరించారు.

బెనర్జీ సూచనలు..

రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పన అంశంపై చర్చిస్తూ.. సంప్రదాయ నైపుణ్యాల్లో ఆధునిక డిజైన్, మార్కెటింగ్, సోషల్ మీడియా సాంకేతిక వినియోగంలో విశిష్టత కలిగిన స్వల్ప కాలిక కోర్సులను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. తద్వారా సంప్రదాయ కళాకారులను ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో భాగంగా.. క్రాఫ్ట్స్, ఆర్ట్స్, సృజనాత్మకత వంటి అంశాలను చేర్చాలని సూచించారు.

అభిజిత్ అభినందనలు..

ట్రాన్స్ జెండర్లను పోలీస్, మున్సిపల్ శాఖల్లో నియమించడం, అలాగే ఔట‌ర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాను సర్వీస్ సెక్టార్‌గా అభివృద్ధి చేసే ప్ర‌ణాళికను ఎంచుకోవటం, స్కిల్ యూనివ‌ర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అద్దం పడుతోందని.. ఈ సందర్భంగా అభిజిత్ బెన‌ర్జీ అభినందించారు.

ప్రపంచానికి చాటిచెప్పాలి..

శ‌తాబ్దాల చరిత్ర ఉన్న హైద‌రాబాద్ విజ‌న్‌ను, ఇక్క‌డ త‌యార‌య్యే ఉత్ప‌త్తులకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆదర‌ణ గురించి ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. తెలంగాణ విశిష్టతలను, ఇక్కడున్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచ దేశాల్లో చాటిచెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రంలో మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతుల సాధికారత, యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్కిల్ డెవెలప్మెంట్ దిశగా ప్ర‌భుత్వం చేప‌డుతున్న విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లను బెనర్జీతో పంచుకున్నారు.

సంబంధిత కథనం