BSP Telangana : ఒంటరిగానే మా పోటీ.. కాంగ్రెస్‍తో పొత్తు వార్తలపై ఆర్ఎస్పీ కీలక ప్రకటన
BSP Telangana Latest News: బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు అంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. అలాంటి వార్తల్లో వాస్తవం లేదన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
BSP Telangana : వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ,కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశముందని కొన్ని టెలివిజన్ ఛానళ్ళలో వచ్చిన వార్తా కథనాల్లో అవాస్తవమన్నారు. బీఎస్పీ,కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
బీఎస్పీ అధినేత్రి బెహన్జీ కుమారి మాయావతి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మే 7 న సరూర్ నగర్ స్టేడియంలో చేసిన ప్రకటనే పార్టీకి శిరోధార్యమన్నారు. తెలంగాణలో దొరల గడీల పాలనను అంతమొందించి బహుజన రాజ్య స్థాపనే పార్టీ అంతిమ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. భావసారూప్య పార్టీలేవైనా బీఎస్పీతో కలిసొస్తే ఎన్నికల పొత్తులపై పునరాలోచిస్తామన్నారు.
కోనప్ప మాఫియా ఆగడాలను ఆరికట్టాలి - ప్రవీణ్ కుమార్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతల భూకబ్జాలు, అక్రమ వ్యాపారాలతో దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా చింతలమనేపల్లి మండలం డబ్బాలో పలు పార్టీలకు చెందిన యువకులు బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సిర్పూర్ ప్రాంతంలో పేద వర్గాలపై అక్రమ కేసులు పెట్టి, బయోబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికారం అండతో ఎమ్మెల్యే అక్రమ బియ్యం దందా,దొంగ లిక్కర్,రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ప్రజా సంపదను దోచుకొని లగ్జరీ కారులు కొంటూ, లగ్జరీ వాచ్ కొనుక్కొని సంపదను కొల్లగొడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ సంపదను దోచుకోవడానికే ఎమ్మెల్యే సిర్పూర్ ప్రాంతంలో అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్.ఆంధ్రా నుంచి వలస వచ్చిన కోనప్పకు తెలంగాణ ప్రజల కష్టాలు పట్టవన్నారు.సిర్పూర్ ప్రాంతంలో కొనప్ప మాఫియా ఆగడాలను అరికట్టాలన్నారు.గూడెం బ్రిడ్జిని ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు.తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు ఎటువంటి కాంట్రాక్టులు దక్కడం లేదన్నారు.పేదల సంపదను కొల్లగొట్టి,ఇక్కడి సంపదను ఆంధ్రకు ప్రాంతానికి దోచుకుపోతున్నారని ఆరోపించారు.డబ్బా గ్రామానికి మన ఊరు మన బడి కింద నిధులు మంజూరైతే, ఎటువంటి పనులు చేయకుండానే ఎమ్మెల్యే నిధులు డ్రా చేశారని ఆరోపించారు.ఎమ్మెల్యే అండతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లక్స్ కట్టారని ఆరోపించారు.కేసీఆర్ పాలనలో అకాల వర్షాలకు పంట నష్టపోతే నష్టపరిహారం కూడా చెల్లించడం లేదన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనప్ప ఆగడాలను దైర్యంగా ఎదుర్కోవడానికి బీఎస్పీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని సవాలు విసిరారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ శ్రేణులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు.
సంబంధిత కథనం