NMOPS On Pension Scheme: కాలయాపన కోసమే కమిటీ.. కేంద్ర వైఖరిలో చిత్తశుద్ధి లేదు-nmops condemns union minister nirmala statement over pension system ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Nmops Condemns Union Minister Nirmala Statement Over Pension System

NMOPS On Pension Scheme: కాలయాపన కోసమే కమిటీ.. కేంద్ర వైఖరిలో చిత్తశుద్ధి లేదు

కమిటీలతో కాలయాపన వద్దు - ఎన్. ఎం.ఓ.పి.యస్
కమిటీలతో కాలయాపన వద్దు - ఎన్. ఎం.ఓ.పి.యస్ (nmops)

National Pension Scheme: కమిటీలతో కాలయాపన చేయవద్దని.. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఎన్. ఎం.ఓ.పి.యస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. పెన్షన్ విధానంపై లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను ఖండించారు.

National Movement for Old Pension Scheme: పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎన్.ఎం.ఓ.పి.యస్( National Movement for Old Pension Scheme) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ. గురువారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను ఖండించారు. నూతన పెన్షన్ విధానంపై ఆర్థిక కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని ప్రతిపాదిస్తున్నట్లు కేంద్రమంత్రి చెప్పటాన్ని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన కేవలం సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను కాలయాపన చేస్తూ మోసగించేలా ఉందని స్థితప్రజ్ఞ విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

మార్చి 16వ తేదీన రాజ్యసభలో దిపేందర్ సింగ్ హుడా అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ కూడా ప్రభుత్వ పరిశీలనలో లేదని లిఖితపూర్వకంగా తెలిపిందన్నారు. కానీ ఇవాళ కేంద్రమంత్రి... సీపీఎస్ ఉద్యోగుల సమస్యలపై కమిటీని ప్రతిపాదించడం అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ,హర్యానాలో ఎన్నికలు జరుగుతాయని.. దీన్ని దృష్టిలో ఉంచుకొనే కమిటీ పై ప్రకటన చేశారని దుయ్యబట్టారు. పాత పెన్షన్ అమలును పునరుద్ధరించకుంటే ఓటమి ఖాయమని తెలిసి ఇలా చెప్పారని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వ విధానంలో చిత్తశుద్ధి లోపించిందని స్థితప్రజ్ఞ మండిపడ్డారు.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ సాగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు స్థితప్రజ్ఞ. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే వేతనాల కోతతో పాటు క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పిందన్నారు. అలా చెప్పిన కేంద్రం ప్రభుత్వం... ఇవాళ లోక్ సభ వేదికగా కమిటీ అంటూ ప్రకటన చేయడమేంటని ప్రశ్నించారు. పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరిని ఖండిస్తున్నట్లు తెలంగాణ సీపీయస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్,కోశాధికారి నరేష్ గౌడ్ చెప్పారు.

WhatsApp channel

సంబంధిత కథనం