T BJP : బండి సంజయ్ కి షాకిచ్చిన అరవింద్.. అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదంటూ కామెంట్
T BJP : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకిచ్చారు. కవితపై సంజయ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన అరవింద్.. వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదంటూ కీలక కామెంట్స్ చేశారు.
T BJP : రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయని చాలారోజుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వంపై కొంత మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరు పట్ల కొందరు కీలక నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే... ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిచిన పార్టీ పెద్దలు, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అయితే.. అధిష్టానం ఆర్డర్స్ తర్వాత కూడా రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాల పూర్తిగా సద్దుమణగలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. బండి సంజయ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు... ఈ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి.
బండి సంజయ్ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో కవిత దోషిగా తేలితే అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సంజయ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వ్యాఖ్యలను సమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్.. విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. అయితే.. బీఆర్ఎస్ విమర్శల్ని తిప్పికొడుతోన్న బీజేపీ వర్గాలు.. తెలంగాణలోని సామెతనే బండి సంజయ్ చెప్పారని.. కవితపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎదురుదాడికి చేస్తున్నారు. ఈ క్రమంలో స్పందించిన ఎంపీ అరవింద్... బండి సంజయ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టడం.. బీజేపీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
"ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ వ్యాఖ్యల నేను సమర్థించను. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిది. తెలంగాణలో చాలా సామెతలు ఉన్నాయి. వాటిని ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలి. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం ఉందంటే నేను ఒప్పుకోను. ఆయన మాటలకు సంజాయిషీ ఆయనే ఇచ్చుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే... హోదా, పవర్ సెంటర్ కాదు... అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది" అని అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"కవిత ఈడి ఆఫీసులో ఉంటే, తెలంగాణ క్యాబినెట్ అంతా ఢిల్లీ లో మకాం వేసింది. ఇదే చిత్తశుద్ది ప్రజల అభివృద్ధి మీద ఉంటే రాష్ట్రం బాగుపడేది. దర్యాప్తుకు కవిత సహకరించలేదని తెలిసింది. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఈడీ అధికారులు అడిగితే... తెలవదు, గుర్తులేదు అని కవిత సమాధానం చెప్పినట్టు తెలిసింది. చేతికి 20 లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు. అవినీతిని అంతం చేయాలని మోడీ కంకణం కట్టుకున్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగితేలారు. మీ వల్లే జెంటిల్మెన్ మాగుంట ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడింది. పెద్ద సంస్థ అరబిందో సైతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం అంటరాని కుటుంబం" అని అరవింద్ ఫైర్ అయ్యారు.
అయితే... బీఆర్ఎస్ పార్టీ, కవిత, సీఎం కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల కంటే... బండి సంజయ్ ను ఉద్దేశించి అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే.. కేవలం అందరినీ సమన్వయం చేసే బాధ్యత మాత్రమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యల ద్వారా.... పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని, నిర్ణయాలు సమష్టిగా తీసుకోవాలనే విషయాన్ని ధర్మపురి అరవింద్ పరోక్షంగా చెప్పారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై బండి సంజయ్ కాంపౌండ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి !